హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ మీడియాపై జులుం ప్రదర్శిస్తున్నదని బీఆర్ఎస్, ప్రజా, జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఐఏఎస్‌ల ప్రతిష్ఠకు భంగం కలిగించినట్టుగా వార్తా కథనం ప్రసారం చేశారంటూ వస్తున్న ఆరోపణలపై నెలకొన్న వివాదంలో జర్నలిస్టుల అక్రమ, బలవంతపు అరెస్టులు సరికాదని బీఆర్ఎస్ స్పష్టంచేసింది. ప్రభుత్వ చర్యలపై పలు సంఘాలు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మీడియా సంస్థల ప్రతినిధులపై రేవంత్ సర్కార్ ప్రతాపం చూపుతున్నదని అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్‌తోపాటు ప్రజాప్రతినిధులు, నేతలు బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. తలసాని మాట్లాడుతూ… సీనియర్ జర్నలిస్టులు దొంతు రమేశ్, సుధీర్, పరిపూర్ణాచారిని అరెస్టు సరికాదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో టీయూడబ్ల్యూజే, ఐజేయూ నేతలతోపాటు పలు పార్టీలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.