హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై సర్కార్‌ను ప్రశ్నిస్తే సీఎం రేవంత్ బూతులతో సమాధానమిస్తున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ‘సర్’పై నిర్వహించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశానికి ఆదివారం ఆయన హాజరై మాట్లాడారు. ఉద్యమనేత కేసీఆర్‌ను తలువనిదే సీఎం రేవంత్‌కు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని, మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నరాని స్పష్టం చేశారు. అధికారం అండతో రెచ్చిపోతున్న కాంగ్రెస్ నేతలకు మిత్తితో చెల్లిస్తామని హెచ్చరించారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో చేసిన అప్పులపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పులపై సవాల్ విసిరిన మం త్రులు తోకముడిచి పారిపోయారని ధ్వజమెత్తారు. చర్చకు సిద్ధపడ్డ హరీశ్‌రావును అక్రమంగా అరెస్ట్ చేయించారని నిప్పులు చెరిగారు. ‘కేసీఆర్ పదేండ్ల పాలనలో రూ. 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చి కాళేశ్వరం, సీతమ్మసాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టారు.. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశారు…కానీ కాంగ్రెస్ 30 నెలల్లో రూ. 4లక్షల కోట్ల రుణం తెచ్చి చేసిన ఒక్క మంచిపనికూడా లేదు..’అంటూ తూర్పారబట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ‘సర్’పై బీఆర్ఎస్ బీఎల్వోలు అప్రమత్తంగా ఉండాలని తలసాని సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఓటూ నమోదయ్యేలా చూడాలని, దొంగ ఓట్లు చేరకుండా జాగ్రత్త వహించాలని విజ్ఞప్తిచేశారు. ఎప్పటికప్పుడూ క్షేత్రస్థాయి పరిస్థితులు, ఓటు నమోదు, వివరాల సమర్పణ ఇతరత్రా అంశాలపై బీఆర్ఎస్ కార్యకర్తలను జాగృతం చేయాలని ఉద్బోధించారు. కొన్ని వర్గాల ఓట్ల తొలగింపే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తున్నదని దుయ్యబట్టారు. ప్రజాదరణ కోల్పోయిన అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార దుర్వినియోగానికి పాల్పడి, దొంగ ఓట్లతో గెలిచిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. మరోసారి అలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వొద్దని కోరారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికే గుర్తింపు దక్కుతుందని, వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభిస్తుందని స్పష్టంచేశారు.