హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ‘అధికారంలోకి వస్తే బీసీ ల సంక్షేమానికి ఏటా రూ.20 వేల కోట్లు బడ్జెట్లో పెడుతామన్న కాంగ్రెస్ దగా చేసింది. ఈ ఏడాది కేవలం రూ.9వేల కోట్లు మాత్రమే కేటాయించింది. గత బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో కేవలం రూ.3 వేల కోట్లే సర్కార్ ఖర్చు చేసింది’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్ ధ్వజమెత్తారు. అంకెల గారడీతో బీసీలను కాంగ్రెస్ నయవంచనకు గురిచేసిందని విమర్శించారు. బీసీ సంక్షేమంపై గురువారం శాసనసభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ సర్కార్ తీరును తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎండగట్టారు. కాంగ్రెస్ వచ్చిన 2024-25లో రూ.9,200 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే.. కేవలం రూ.1,932 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు.
అంటే కేవలం 20 శాతం మాత్రమే సర్కార్ ఖర్చు చేసిందని నిలదీశారు. 2025-26 బడ్జెట్లో రూ.11,405 కోట్లు కేటాయిస్తే.. అందులో ఖర్చు చేసింది కేవలం రూ.3వేల కోట్లేనని స్పష్టంచేశారు. బీసీలను ఇంతలా మోసగిస్తరా? అణగారిన పేదలు అడగలేరనా? ఏమీ చేయలేరనా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నాడు కర్ణాటక నుంచి సిద్ధరామయ్యను పిలిచి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అలవిగాని హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. రాజకీయ ప్రాతినిధ్యంలో, కాంట్రాక్టుల్లో 42 శాతం కోటా ఇస్తామని, బడ్జెట్లో ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని, బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తామని నాడు కాంగ్రెస్ చెప్పి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు ఇలా అంకెల గారడీ చేస్తూ దగా చేస్తున్నదని మండిపడ్డారు.
9వ షెడ్యూల్‌తోనే సాధ్యమని ఆనాడే చెప్పాం
బీసీ రిజర్వేషన్లు అనేది హడావుడిగా చేస్తే అయ్యే పనికాదని బీఆర్ఎస్ పార్టీ ఆనాడే చెప్పిందని తలసాని గుర్తుచేశారు. బీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే సమయంలో తమ మద్దతు ఇస్తూనే 9వ షెడ్యూల్లో పెడితేనే బిల్లు సాధ్యమవుతుందని, దానిపై సుప్రీంకోర్టులో కేసులు, తీర్పులు ఉన్నాయని చెప్పామని పేర్కొన్నారు. అయినా బీసీ కమిషన్‌ను పక్కనబెట్టి.. జీవోలు, ఆర్డినెన్స్‌ల ద్వారా జరుగాలని హడావుడి చేశారని తెలిపారు. జంతర్‌మంతర్ వద్ద సీఎం సహా ధర్నా చేశారని, కానీ, ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి ఆ విషయంలో చొరవ తీసుకోలేదని తెలిపారు.
మొదటిసారి జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేసేటప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఆహ్వానం పంపలేదని ప్రశ్నించారు. జంతర్‌మంతర్ వద్ద కాంగ్రెస్ దీక్షకు ఆ పార్టీ అగ్రనేతలైన రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే ఎందుకు రాలేదని, పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. వారికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగేవారని చెప్పారు. నిధులు, రిజర్వేషన్లు, ఇతర అంశాలపై నిత్యం బీసీలు పాలకులను అడుక్కోవాలా? అని ప్రశ్నించారు.
నాడు కేసీఆర్ 45 వేల కోట్లు ఖర్చు చేసిన్రు
ఉమ్మడి రాష్ట్రంలో బీసీల కోసం ఒక పార్టీ ప్రభుత్వం పదేండ్లలో రూ.120 కోట్లు ఖర్చు పెడితే, మరొక పార్టీ పదేండ్లలో రూ.16 వేల కోట్లు ఖర్చు చేసిందని తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. అదే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో 9 ఏండ్లలోనే బీసీల కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు చేశారని వివరించారు. బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కోసం శాసనసభ తొలి స్పీకర్‌గా బీసీ బిడ్డ మధుసూదనాచారికి, మండలి తొలి చైర్మన్‌గా స్వామిగౌడ్‌కు కేసీఆర్ అవకాశం కల్పించారని తెలిపారు. ఇద్దరు బీసీ బిడ్డలను రాజ్యసభకు పంపారని తెలిపారు. ఉస్మానియా వీసీగా బీసీకి అవకాశం ఇచ్చారని తెలిపారు. బీసీల కోసం 327 గురుకులాలు, ఇంజినీరింగ్, డిగ్రీ, లా, మెడికల్, మహిళా కాలేజీలు ఏర్పాటు చేశారని చెప్పారు. 4,311 మందికి ఉద్యోగాలు ఇచ్చారని, బీసీల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.
ఎవరిని మోసగించడానికి కామారెడ్డి డిక్లరేషన్?
‘140 ఏండ్ల చరిత్ర ఉన్న పార్టీ.. అధికారంలో లేమని తెలిసి, ఎవరిని మోసం చేయడానికి కామారెడ్డి డిక్లరేషన్ పెట్టారు?’ అని తలసాని శ్రీనివాస్‌యాదవ్ తీవ్రస్థాయిలో నిలదీశారు. సమాజంలో బీసీలు 56 శాతంగా ఉంటే.. కులగణన చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ 46 శాతానికి తగ్గించిందని విమర్శించారు. ‘బీసీలు సహా దళిత, గిరిజన, మైనారిటీలు రాజకీయంగా బయటకెళ్తే మీరే రిజర్వేషన్లు అడిగే పరిస్థితి వస్తది గుర్తు పెట్టుకోండి’ అని హెచ్చరించారు. ‘తెలంగాణ బీసీలను నమ్మించి మోసం చేయకండి, నమ్మించి గొంతు కోయకండి. మీరు ఏం చేస్తారో తప్పకుండా చెయ్యాలి. మీరు తెలిసే, మోసం చేయాలనే దురుద్దేశంతోనే హామీలిచ్చారు’ అని మండిపడ్డారు. బూసాని కమిషన్ వేసి దానిని టేబుల్ చేశారా? పబ్లిక్ డొమైన్లో పెట్టారా? అని ప్రశ్నించారు.
బీసీ సబ్‌ప్లాన్ కోసం, రూ.20 వేల కోట్ల బడ్జెట్ కోసం, మంత్రి పదవి కోసం, కాంట్రాక్టుల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసమూ 9వ షెడ్యూల్‌కు పోవాల్నా? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో తీర్పులున్న తర్వాత.. బిల్లులు చెల్లవని తెలిసి కూడా మోసం చేశారని, బీసీ బుద్ధిజీవులను కూడా బురిడీ కొట్టించారని విమర్శించారు. ‘దామాషా ప్రకారం తెలంగాణలో మున్నూరుకాపు, గొల్ల కురుములకు రాజకీయ ప్రాతినిధ్యం ఏది? దాన్ని కూడా 9వ షెడ్యూల్లో పెట్టాలా? ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించేందుకు, విదేశీ విద్యకు డబ్బులు చెల్లించేందుకు 9వ షెడ్యూల్లో పెట్టాలా?’ అని ప్రశ్నించారు.
బీసీ సబ్‌ప్లాన్‌పై క్యాబినెట్లో చర్చించండి
బీసీ సబ్‌ప్లాన్‌పై, మున్నూరుకాపులు, గొల్ల కురుమలు, గిరిజన బిడ్డలకు మంత్రి పదవుల కోసం క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రిని బీసీ మంత్రులు నిలదీయాలని తలసాని శ్రీనివాస్‌యాదవ్ కోరారు. బీసీ సబ్‌ప్లాన్ అనేది కాంగ్రెస్ ఇచ్చిన హామీ కాదా? ఎందుకు బీసీలను మోసం చేస్తున్నారు? అని నిలదీశారు. ఎస్సీల సబ్‌ప్లాన్‌లో పూర్తిగా ఖర్చుపెట్టడం లేదు.. గిరిజనులకు సబ్‌ప్లాన్ పెడుతమని ఎందుకు పెట్టలేదు? ఎందుకు పదేపదే మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘కేసీఆర్ నాడు హైదరాబాద్‌లో కులాలవారీగా ఆత్మగౌరవ భవనాలకు స్థలాలిచ్చారు. బీసీలకు కోకాపేటలో ఎకరం రూ.120 కోట్లు ఉన్న స్థలాన్ని ఇచ్చారు. అందుకే తెలంగాణ తెచ్చుకున్నామని, బీసీలు ఎదగాలని నాడు కేసీఆర్ కోరుకున్నారు’ అని తెలిపారు. ఓవర్సీస్ పథకం కోసం ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షలు ఖర్చు చేశారని, ఇప్పుడున్న మంత్రిని డబ్బులడిగితే అదిగో ఇస్తాం.. ఇదిగో ఇస్తామని అంటున్నారని మండిపడ్డారు. ఇక్కడ నలుగురు మంత్రులున్నా.. గ్రామాల్లో రాజకీయంగా ఎదగాలంటే బీసీలు ఇంకా బయపడే పరిస్థితి ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
తెలంగాణ ఉద్యమం, కేసీఆర్.. ఓ చెరగని చరిత్ర!
దేశ చరిత్రలో తెలంగాణ ఉద్యమం ఓ చెరగని చరిత్ర అని తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. ‘మన కండ్లముంగటనే 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. 1972తో ముగిసింది అనుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ ఒక బలమైన ఉద్యమాన్ని నడిపించారు. ఇది మనం చెప్పేది కాదు. ఆ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం అనే ఒక చిత్రపటం ఉన్నది. దానికి నాయకత్వం వహించింది కేసీఆర్ అని చరిత్ర చెబుతుంది’ అని పేర్కొన్నారు. బీసీలను మోసం చేస్తున్న తీరును ఇప్పటి యువత గమనిస్తున్నదని పేర్కొన్నారు. సంఖ్య ఎక్కువగా ఉండి.. అధికారం లేదనే అభిప్రాయం వారిలో నెలకొన్నదని చెప్పారు.
తెలంగాణలో బీసీలైన ఐఏఎస్, ఐపీఎస్‌లను సైతం తొక్కేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు దళితులపై చిత్తశుద్ధి ఉంటే రూ.12 లక్షల దళితబంధు పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఇకనైనా బీసీలకు పెట్టిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని, అంకెలగారడీ కాదని నిరూపించుకోవాలని హితవు పలికారు. తలసాని ప్రసంగం అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ సహా పలువురు ఎమ్మెల్యేలు తలసానిని హత్తుకొని అభినందించారు. తలసాని ప్రసంగిస్తున్న సమయంలో విడతల వారీగా విప్ ఆది శ్రీనివాస్, మంత్రులు వాకిటి శ్రీహరి, సీతక్క, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌గౌడ్ పలుమార్లు అడ్డుతగిలినా కాంగ్రెస్ హయాంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఎలుగెత్తి చాటారు.