కారేపల్లి,జూన్ 25 : ఎన్నో దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని నిబద్ధతతో ఉన్న సీనియర్లకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు దక్కటం లేదని సింగరేణి(కారేపల్లి)కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తలారి చంద్రప్రకాష్ అన్నారు. ఈనెల 30న ఖమ్మం జిల్లాలో జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని గురువారం కారేపల్లి మండల కేంద్రంలో గల ఆ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు.
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ ,మాజీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గ ప్రసాదు హాజరైన ఈ సమావేశంలో తలారి చంద్ర ప్రకాష్ మాట్లాడుతూ తన దశాబ్దాల రాజకీయ ప్రస్థానాన్ని, పార్టీ పట్ల తనకున్న నిబద్ధతను గుర్తు చేసుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో చేరిన నాటి నుండి నేటి వరకు పార్టీ విజయాల్లో తాను పోషించిన కీలక పాత్రను వివరించారు.
ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ధ్వజమెత్తారు. 2024లో సీనియర్లంతా ఎంతో శ్రమించి బీఆర్ఎస్ ప్రవాహానికి ఎదురు ఈది కాంగ్రెస్ గౌరవాన్ని కాపాడగలిగామని ఆయన గుర్తు చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కండువా కప్పుకున్న వారికి ప్రాధాన్యతనిచ్చి నామినేటెడ్, పార్టీ పదవులను కట్టబెట్టడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సోషల్ మీడియాలో చంద్రప్రకాష్ వ్యాఖ్యలు వైరల్గా మారాయి.