ఖైరతాబాద్, ఫిబ్రవరి 6 : ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్‌రెడ్డి గిరిజనులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బానోతు హుస్సేన్‌నాయక్ విమర్శించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడి యాతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా గిరిజనులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదని ఆరోపించారు. నిరుడు సేవాలాల్ జయంతికి రూ.2 కోట్లు కేటాయిస్తున్నట్టు స్వయంగా సీఎం ప్రకటించారని, మళ్లీ జయంతి వచ్చినా ఇంతవరకు నిధులు విడుదల చేయలేదని మండిపడ్డారు.
హైదరాబాద్ నడిబొడ్డున సేవాలాల్ మహరాజ్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని మాట నిలుపుకోలేదని విమర్శించారు. ప్రత్యేక ఎస్టీ కమిషన్, సేవాలాల్ కార్పొరేషన్, పోడు భూములకు పట్టాలంటూ అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశంలో భాస్కర్‌నాయక్, లాలుప్రసాద్నాయక్, కల్యాణ్‌నాయక్, రాజునాయక్, రాజు రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.