హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌శాఖ (ఎంఏయూడీ) అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, చికున్ గున్యా లాంటి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బుధవారం సచివాలయంలో ఎంఏయూడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. నగర జనాభా అవసరాలకు అనుగుణంగా రాబోయే 25 ఏండ్లను దృష్టిలో ఉం చుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
హైదరాబాద్, జూన్ 25(నమస్తే తెలంగాణ): తెలంగాణ రైజింగ్-2047ను ప్రశంసిస్తూ ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీబ్లెయిర్ బుధవారం సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. ఇటీవల ఢిల్లీలో టోనీబ్లెయిర్‌తో సమావేశమైన రేవంత్ తెలంగాణ రైజింగ్ విజన్ -2047 గురించి వివరించారు. తెలంగాణ రైజింగ్ విజన్ రూపకల్పన, అమలుకు సంబంధించి టోనీబ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్(టీబీఐజీసీ), తెలంగాణ ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ మార్చుకున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా టోనీబ్లెయిర్ లేఖ రాశారు. కాగా, బోనాల ఉత్సవాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. బోనాల ఉత్సవాల ఏర్పాట్లు, భక్తుల సదుపాయాల కోసం రూ. 20 కోట్ల నిధులు విడుదల చేసినట్టు తెలిపారు.