హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని దళిత, గిరిజనుల భూములను కాపాడాలంటే తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్చార్సీ)ను కోరారు. సోమవారం ఎంసీఆర్‌హెచ్చార్డీలో నిర్వహించిన బహిరంగ విచారణకు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొండకల్, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం వెలిమెలకు చెందిన గిరిజనులతో ఆయన హాజరయ్యారు. ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి, విజయభారతి సయాని కేసు పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
వెలిమెలలో సుమారు 429 ఎకరాల గిరిజనుల సాగుభూములను కొంతమంది రియల్ ఎస్టేట్ కంపెనీలు బలవంతంగా ఆక్రమిస్తున్నాయని బక్కా జడ్సన్ కమిషన్ తీసుకెళ్లా రు. ఈ భూమిని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టాలని చూస్తున్నారని బక్కా జడ్సన్ ఆరోపించారు. గతంలో లగచర్ల ప్రాంతంలోనూ భూములు గుంజుకున్నారని కమిషన్‌కు చెప్పారు. నిరసన తెలుపుతున్న వారిపై రౌడీషీట్ తెరుస్తున్నారని, రౌడీలతో కొట్టిస్తున్నారని తెలిపారు. బాధితు లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నార ని ఆయన కమిషన్ దృష్టికి తెచ్చారు. వాదనలు విన్న కమిషన్.. జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను వివరణ కోరగా.. ఆమె ఎన్‌హెచ్చార్సీ వెబ్సైట్లో కేసుకు సంబంధించిన వివరణను అప్లోడ్ చేసినట్టు చెప్పారు. బాధితుల ఫిర్యాదుపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుందో బాధితులకు చెప్పాలంటూ కమిషన్ కోరింది. విచారణ అనంతరం వివరణ కాపీని జడ్సన్‌కు అందించారు.