(స్పెషల్ టాస్క్ బ్యూరో) జూలై 9, (నమస్తే తెలంగాణ): అది అత్యంత విలువైన ఐటీ కారిడార్‌లోని గోపన్‌పల్లి ప్రాంతంలో ఉన్న బసవ తారకనగర్. కొందరు నిరుపేదలు ఎప్పటి నుంచో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని తలదాచుకుంటున్నారు. ఉన్నఫలంగా ఇప్పుడు ఆ గుడిసెలు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. నిరుపేద కుటుంబాలు రాత్రికి రాత్రే అక్కడి నుంచి వెళ్లిపోతున్నాయి. ఏ హైడ్రా బుల్డోజర్ అక్కడికి రాలేదు.. ఏ ప్రభుత్వ అధికారీ వారిని వెళ్లగొట్టలేదు. మరి ఏం జరుగుతున్నది? ఎందుకు గుడిసెలు ఖాళీ అవుతున్నాయి? అని ఆరా తీస్తే.. సినీ ఫక్కీలో జరుగుతున్న గూడుపుఠాణీ బయటికొచ్చింది. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో కొందరు ప్రైవేట్ వ్యక్తులు కాలనీలో చక్రం తిప్పుతున్నారు. రోజుకు ఒకటిరెండు గుడిసెల్ని ఎంపిక చేసుకొని వాళ్లతో మాట్లాడుతున్నారు.
రాత్రికి రాత్రే వెళ్లిపోవాలంటూ ఒకటిరెండు లక్షలు చేతిలో పెడుతున్నారు. ఎవరైనా కాదు, లేదని అంటే మూడు నాలుగు లక్షలు కూడా ఇస్తున్నారు. ఫలితంగా రోజుల వ్యవధిలోనే వంద గుడిసెలకుపైగా ఖాళీ అయ్యాయి. ఇంకా కొన్ని గుడిసెలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఖాళీ చేయడానికి వాళ్లు నిరాకరిస్తుండటంతో బేరాలు కొనసాగుతున్నాయి. ఈ విషయం తెలుసుకొని పలువురు మాజీ, తాజా ప్రజాప్రతినిధులు వచ్చి చూశారు. అధికారులను సంప్రదిస్తే, అది ప్రైవేటు భూమి అని వాళ్లు చెప్పడంతో సదరు నేతలు మిన్నకుండిపోతున్నారు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ లోతుగా విచారించగా గుడిసెలను ఖాళీ చేయడం వెనుక ఒకటీ అరా కాదు.. ఎకరం రూ.100 కోట్ల వరకు ధర పలికే ఆ ప్రాంతంలో ఏకంగా రూ.9వేల కోట్ల విలువైన 90 ఎకరాల ప్రభుత్వ భూమికే వేసిన స్కెచ్ బయటికొచ్చింది. ఆ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే దందా వెనక ‘బిగ్ బ్రదర్స్’ సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. భూ మార్పిడిపై గతంలోనే అనధికారిక ఒప్పందాలు జరిగాయని సమాచారం.
ఉమ్మడి రాష్ట్రంలో సంఘాలకు కేటాయింపు
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామ పరిధిలోని సర్వేనంబరు 25, 36, 37 లోని సుమారు 427 ఎకరాల ప్రభుత్వ భూమిని వైఎస్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల ఇండ్ల స్థలాల కోసం జేఏసీకి కేటాయించారు. అనంతరం ఉద్యోగుల వినతి మేరకు ఆయా యూనియన్లకు ప్రత్యేక కేటాయింపులు జరిపారు. ఇందులో భాగంగా టీఎన్జీవో, ఏపీ సచివాలయ ఉద్యోగులు, హైకోర్టు ఉద్యోగులు, ఏపీ ఎన్జీవో కోఆపరేటివ్ హౌసింగ్ సొపైటీలకు ప్రత్యేకంగా కేటాయింపులు జరిగాయి. ఈ క్రమంలో సర్వే నంబరు 36, 37ల్లోని 189.11 ఎకరాల భూమిని ఏపీ ఎన్జీవోలకు కేటాయించారు. ఈ మేరకు 2008లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మెమో నంబరు 46112/అసోసియేషన్ 5/2005, తేది: 8.8.2008 జారీ చేశారు. ఇందులో సర్వేనంబరు 36లో 142.15 ఎకరాలు ఉండగా, సర్వేనంబరు 37లో 32.31 ఎకరాలు ఉన్నది. ఏపీ ఎన్జీవోలు ఈ భూముల్లో లేఅవుట్ రూపొందించారు. సర్వేనెంబరు 36లోని 142.15 ఎకరాల లేఅవుట్‌కు 2010లో జీహెచ్ఎంసీ నుంచి అనుమతి (ప్రొసీడింగ్ నెంబరు 1843) తీసుకొని రూ.3.98 కోట్లను ఫీజులు, చార్జీల కింద చెల్లించారు. అనంతరం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించుకొని ప్లాట్లను సభ్యులకు కేటాయించారు. దీనిపై మరికొందరు సభ్యులు హైకోర్టుకు వెళ్లడంతో న్యాయస్థానం స్టే ఇచ్చింది. దీంతో సర్వేనెంబరు 37లోని 32 ఎకరాల భూమిని అభివృద్ధి చేసే పనులు నిలిచిపోయాయి. ప్లాట్లు పొందినవాళ్లు కూడా కోర్టు స్టే కారణంగా ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టలేకపోయారు.
మాదేనంటూ ప్రైవేట్ వ్యక్తులు వచ్చినా..
గోపన్‌పల్లి సర్వేనంబరు 36, 37ల్లో తమకు 90 ఎకరాల భూమి ఉన్నదంటూ డీ నర్సింగరావు, ఇతరులు ఉమ్మడి రాష్ట్రంలో నుంచి క్లెయిమ్ చేస్తూ వస్తున్నారు. కానీ ప్రభుత్వ రికార్డుపరంగా, పొజిషన్పరంగా సదరు వ్యక్తులకు ఎలాంటి ఆధారాలూ లేవని రెవెన్యూ అధికారులు కొట్టిపారేశారు. దీంతో నర్సింగరావు, ఇతరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించి 2015లో తీర్పు వచ్చింది. దీనిపైనా కేసీఆర్ ప్రభుత్వం న్యాయ సలహాలు తీసుకోవ డం, వారికి అనుకూలంగా ఆధారాలను ఆరా తీసింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని ఇండ్ల స్థలాల కోసం ఇవ్వాలని భాగ్యనగర్ టీఎన్జీవోలు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరడంతో వారికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. న్యాయపరమైన చిక్కుగా ఉన్న డీ నర్సింగరావు, ఇతరులకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పుపైనా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములు (భాగ్యనగర్ టీఎన్జీవో భూములు), ప్రైవేట్ వ్యక్తులు క్లెయిమ్ చేస్తున్న భూములు ఒకటేనా? కాదా? అనే అంశాన్ని తేల్చాలని రెవెన్యూ శాఖను ప్రభుత్వం ఆదేశించింది.
ఈ మేరకు 2020, 2021ల్లో అధికారులు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. రికార్డుల పరిశీలనతోపాటు, క్షేత్రస్థాయిలో భూమి మీదికి వెళ్లి పరిశీలించగా డీ నర్సింగరావు, ఇతరులకు సంబంధించిన భూ వివరాలేవీ లభ్యం కాలేదని తేల్చారు. ఈ నేపథ్యంలో భాగ్యనగర్ టీఎన్జీవోకు చెందిన భూములతో డీ నర్సింగరావు, ఇతరులు క్లెయిమ్ చేస్తున్న భూములకు ఎలాంటి సంబంధంలేదని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 4.1.2021న ప్రభుత్వానికి పంపిన నివేదికలో స్పష్టం చేశారు. రాజేంద్రనగర్ ఆర్డీవో ఇచ్చిన నివేదికలోనూ నర్సింగరావు, ఇతరులకు సంబంధించిన రికార్డులు ఎక్కడా లేవని, వారు తమ భూమికి సంబంధించిన పొజిషన్ చూపించడంలో విఫలమయ్యారని కలెక్టర్ నివేదికలో తెలిపారు. క్షేత్రస్థాయిలో సర్వేనెంబరు 36/పీ లోని 142.15 ఎకరాలు ఇప్పటికే లేఅవుట్ చేసి రోడ్లు, విద్యుత్తు లైన్లు వేశారని, భాగ్యనగర్ టీఎన్జీవో కార్యాలయం కూడా అందులో ఉన్నదని పేర్కొన్నారు. సర్వేనంబరు 37/పీ లోని 46.38 ఎకరాలు (రోడ్డుకు ఒకవైపు 7.14 ఎకరాలు, మరోవైపు 39.22 ఎకరాలు) చెట్ల పొదలతో నిండి ఉన్నదని పొందుపరిచారు. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు, హైకోర్టులో స్టేటస్కో ఉండటం వంటి న్యాయపరమైన చిక్కు లున్నా కేసీఆర్ ప్రభుత్వం ఆ భూమిని కాపాడుకుంటూ వచ్చింది. ఐటీ కారిడార్‌కు ఆనుకొని ఉన్న భూములు కావడంతో ఎకరా రూ.వంద కోట్లుగా అంచనా వేసినా 189.11 ఎకరాలకు దాదాపు రూ.18 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేసీఆర్ ప్రభుత్వం కాపాడుకుంటూ వచ్చింది.
ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
అత్యంత విలువైన భూముల్ని స్వాధీనం చేసుకొని కేసీఆర్ ప్రభుత్వం కాపాడితే.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అందులో 90 ఎకరాలకు ఎసరు పెట్టినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ భూములు ఉంటే సర్కారు ల్యాండ్ బ్యాంకులో ఉండాలి, లేదా భాగ్యనగర్ టీఎన్జీవోలకు చెందిన తెలంగాణ ఉద్యోగులకు ఇండ్ల స్థలాల కోసం అప్పగించాలి. కానీ ఇవేవీ కాకుండా 2021లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పంపిన నివేదికకు భిన్నంగా భాగ్యనగర్ టీఎన్జీవో (ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఎన్జీవో)కు కేటాయించిన భూముల్లో నుంచి నర్సింగరావు, ఇతరులకు 90 ఎకరాలను అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.
హైకోర్టు స్టేటస్ కో కొనసాగుతున్న సమయంలో పావులు కదులుతుండటం గమనార్హం. ఇందులో భాగంగానే సర్వేనెంబరు 37లోని రోడ్డుకు ఒకవైపు 7.14 ఎకరాల్లో పేదలు గుడిసెలు వేసుకున్న బసవతారక నగర్‌ను మాయం చేస్తున్నట్టు తెలిసింది. ఈ భూమితోపాటు ఇదే సర్వేనెంబరులోని మరో సుమారు 22.20 ఎకరాలకు ఇప్పటికే రెవెన్యూ శాఖ నుంచి నర్సింగరావు, ఇతరుల పేరిట ఎన్వోసీ జారీ చేసినట్టు శేరిలింగంపల్లి తాసిల్దార్ వెంకారెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. అంటే ప్రైవేటు వ్యక్తులు క్లెయిమ్ చేస్తున్న 90 ఎకరాల్లో ఇప్పటికే దాదాపు 30 ఎకరాలకు లైన్ క్లియర్ కాగా, మిగతా దానికి కూడా త్వరలో ఎన్వోసీ రానున్నట్టు తెలుస్తున్నది. ఇదే అంశంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని సంప్రదించగా ‘నివేదికను ప్రభుత్వానికి పంపాం’ అని సమాధానమిచ్చారు.
ఒకచేత్తో ఇచ్చి.. మరో చేత్తో లాక్కొని..
గోపన్‌పల్లిలోని సర్వేనెంబరు 36, 37ల్లో తమకు 90 ఎకరాల భూమి ఉన్నదంటూ డీ నర్సింగరావు, ఇతరులు చేస్తున్న వాదనలను ఉమ్మడి ఏపీ నుంచి కేసీఆర్ ప్రభుత్వం వరకు సమర్థంగా తిప్పికొట్టారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం వారికి అనుకూలంగా అడుగులు వేయడం వెనక భారీ భూదందా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వారిలో డీ నర్సింగ్‌రావు, ఇతరుల పేర్లు ఉన్నా, వారి నుంచి గతంలోనే చాలా మంది అగ్రిమెంట్లు చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో కాంగ్రెస్‌కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్టు సమాచారం. వీరిలో ఉమ్మడి నల్గొండకు చెందిన ఒక ఎంపీతోపాటు వికారాబాద్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నట్టుగా తెలిసింది. ఇదే అదునుగా బిగ్ బ్రదర్స్ కూడా రంగంలోకి దిగారని, తమ పనినీ చక్కబెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇలా అధికార పార్టీకి చెందిన వారే తెర వెనక ఉండటంతో ఒక చేత్తో సాంకేతికంగా నర్సింగరావు, ఇతరులకు ఎన్వోసీ ఇచ్చి , మరో చేత్తో ఆ భూముల్ని దక్కించుకునేలా సదరు నేతలు పక్కా ప్రణాళిక రూపొందించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ భూమిని కాపాడిన కేసీఆర్ ప్రభుత్వం
తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో నాటి సీఎం కేసీఆర్‌ను తెలంగాణ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలిశారు. ఏపీ ఎన్జీవోలకు కేటాయించిన భూమి అంశాన్ని ప్రస్తావించారు. దీంతో వెంటనే కేసీఆర్ ఈ అంశంపై దృష్టిసారించారు. రాష్ట్రం విడిపోయినందున ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం ఎలాగూ అక్కడే ఇండ్ల స్థలాలు కేటాయిస్తుందని, కాబట్టి హైదరాబాద్‌లో ఏపీ ఉద్యోగులకు కేటాయించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఏపీ ఎన్జీవోలోని తెలంగాణ ఉద్యోగులు విడిపోయి వేరే సంఘంగా ఏర్పడతామని ప్రభుత్వానికి చెప్పారు. దీంతో కేసీఆర్ ప్రభుత్వం ఏపీ ఎన్జీవో భూ కేటాయింపులను రద్దు చేసింది. ఏపీ ఎన్జీవోలకు సంబంధించిన రెండు సంఘాల మధ్య వివాదం తేలి, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు 189.11 ఎకరాల భూమిని రంగారెడ్డి కలెక్టర్ సంరక్షణలో ఉంచాలని 2.7.2014న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానిపై ఏపీ ఎన్జీవోలు హైకోర్టును ఆశ్రయించగా స్టేటస్ కో వచ్చింది. అది ఇప్పటికీ కొనసాగుతున్నది. ఏపీ ఎన్జీవోల్లో వేలాది మంది తెలంగాణ ఉద్యోగులకు సభ్యత్వం ఉన్నది. వారు రాష్ట్ర విభజన అనంతరం 2019 ఏప్రిల్‌లో ఏపీ ఎన్జీవో పేరును అధికారికంగా భాగ్యనగర్ టీఎన్జీవోగా (సీ నెం.604/2019-ఎంఏసీఎస్-24.4.2019) మార్చారు. అనంతరం తమకు ఇండ్ల స్థలాలను ఇవ్వాల్సిందిగా కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరారు.
దగ్గరుండి చక్కబెడుతున్న సలహాదారు
90 ఎకరాలకు మార్గం సుగమం చేసి తద్వారా ప్రభుత్వంలోని కొందరు పెద్దలకు భూములు దక్కేలా రూపొందించిన ప్రణాళికను ‘సలహాదారు’ ఒకరు పక్కాగా అమలు చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. ఇందులో భాగంగానే తొలుత బసవతారక నగర్ బస్తీవాసులను ఖాళీ చేయించడంతోపాటు తొలుత 30 ఎకరాలకు ఎన్వోసీ రావడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. మరోవైపు భాగ్యనగర్ టీఎన్జీవోల నుంచి అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు ముందుగానే వారిని నయానో భయానో దారికి తెచ్చుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు గతంలో లేఅవుట్ రూపొందించిన 142.15 ఎకరాలు దక్కాలంటే మిగిలిన 32 ఎకరాల భూమిని వదులుకోవాలని షరతు విధించినట్లు తెలిసింది. ఆ మేరకు భాగ్యనగర్ టీఎన్జీవో గత సోమవారం నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో 32 ఎకరాల భూ మిని వదులుకునేందుకు తీర్మానం చేసినట్టు సమాచారం. దీనిపై స్పందించాలని భాగ్యనగర్ టీఎన్జీవో అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్‌ను ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించగా, ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు.
నిరుపేదలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటారు. విలువైన ఆ భూములపై అధికార పార్టీకి చెందిన నేతల కన్ను పడుతుంది. ప్రైవేట్ వ్యక్తుల సాయంతో నయానో, భయానో ఆ గుడిసెలను ఖాళీ చేయిస్తారు. కాపాడాల్సిన స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు అక్రమార్కులకే అండగా నిలుస్తారు. చివరికి ఆ భూమిని స్వాహా చేసి ఎవరివాటా వారు పంచుకుంటారు… ఎప్పుడూ సినిమాల్లో చూసే ఇలాంటి సన్నివేశాలు ఇప్పుడు హైదరాబాద్‌లో నిజంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల సహకారంతో రూ.9వేల కోట్ల విలువైన భూములను స్వాహా చేసేందుకు ‘బిగ్ బ్రదర్స్’ స్కెచ్ వేశారు. కాలనీని ఖాళీ చేసే పనిలో చివరి దశకు చేరుకున్నారు. తీగలాగితే డొంకంతా కదిలినట్టు.. ‘నమస్తే తెలంగాణ’ పరిశీలనలో భారీ భూదందా వెలుగులోకి వచ్చింది. ఇటీవలే ఖాజాగూడలోని సర్వే నంబరు 27లో రూ.2వేల కోట్ల విలువైన 27 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆకాశహర్మ్యాలు వెలుస్తున్నాయంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు హైకోర్టు తలుపు తట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఐటీ కారిడార్‌లో, కంచె గచ్చిబౌలి భూములకు ఆనుకొని ఉన్న 90 ఎకరాల ప్రభుత్వ భూమి కైంకర్యానికి వేగంగా పావులు కదులుతున్నాయి. నిరుపేదలు గుడిసెలు వేసుకుంటే రాత్రికి రాత్రే బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. రూ.వేల కోట్ల ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనూ అనేక సర్వేలు, పరిశీలనల్లో ప్రభుత్వానివిగా తేలిన 90 ఎకరాల భూమిని ప్రభుత్వ పెద్దలు అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.వంద కోట్ల వరకు పలుకుతుంది. ఈ భూములు ‘పోరంబోకు’ అని రెవెన్యూ రికార్డుల్లో నమోదవడమే కాకుండా, పలు సందర్భాల్లో అధికారులు ప్రైవేటు వ్యక్తులకు సంబంధం లేదని నివేదికలు ఇచ్చారు. అయినా వాటిని కాదని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు గోపన్‌పల్లిలో సినీ ఫక్కీలో సాగుతున్న భూ దందా ఇది.
అది ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులకు హైదరాబాద్‌లోని గోపన్‌పల్లి ప్రాంతంలో అప్పగించిన స్థలం. దానిచుట్టూ వివాదాలు, న్యాయ చిక్కులు కమ్ముకున్నాయి. ఎవరెవరో ఏవో కాగితాలు పట్టుకుని ఆ భూమి తమదేనన్నారు. ఆక్రమణకు ప్రయత్నించారు. కోర్టులను ఆశ్రయించారు. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ సర్కారు దాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తించింది. వివాదాలన్నీ పరిష్కరించి, విలువైన భూమిని పరిరక్షించింది.
కాలక్రమేణా ఆ ప్రాంతం ఐటీ కారిడార్‌గా ఎదగడంతో ఆ భూమి విలువ ఎన్నో రెట్లు పెరిగింది. కేసీఆర్ పాలనలో పదేండ్లు భద్రంగా ఉన్న ప్రభుత్వ భూమి.. ఇప్పుడు కొందరు పెద్దల కంట్లో పడింది. విప్రో సర్కిల్ సమీపంలోని ఆ భూమిలో 90 ఎకరాలను ఎలాగైనా చేజిక్కించుకోవాలని బిగ్‌బ్రదర్స్ అండతో కొందరు స్కెచ్ వేస్తుండగా, వారి తరఫున ఓ సలహాదారు వ్యవహారం నడుపుతున్నారు. ఎన్వోసీ ఇవ్వాలని ఎన్జీవోలపై ఒత్తిడి తెస్తున్నారు. బసవతారకనగర్‌లో ఉంటున్న పేదలనూ బెదిరిస్తున్నారు. గుడిసెలను ఖాళీ చేయిస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు.ఆ భూమి 90 ఎకరాలు! అక్కడ ఎకరం రూ.100 కోట్లు! అంటే ఆ దందా విలువ అక్షరాలా 9 వేల కోట్లు!
బసవతారకనగర్ బస్తీలో మేము ఏండ్ల తరబడి గుడిసెలు వేసుకొని, ఇండ్లు కట్టుకొని ఉంటున్నం. ఆధార్, రేషన్ కార్డులు, విద్యుత్తు, నీటి బిల్లులు ఉన్నయి. కొందరు మామీదికి వచ్చి దౌర్జన్యం చేస్తున్నరు. మమ్మల్ని కొట్టి భూములు గుంజు కుంటున్నరు. హిజ్రాలను పురమాయించి దాడులు చేయిస్తున్నరు. న్యాయం చేయాల్సిన అధికారులు ఈ భూములపై కబ్జాదారులకే ఎన్వోసీ ఇచ్చిండ్రు.. – బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బసవతారక నగర్ బస్తీ కమిటీ వాసుల ఆవేదన