హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీ-వర్స్పై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ భవిష్యత్తును ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప విజన్ టీ-వర్స్ అని కొనియాడారు. ‘టీ-వర్స్ అనేది కేవలం ఒక భవనం కాదు… అది తెలంగాణ యువత కలలకు రెకలు తొడిగిన ఒక అద్భుత ప్రయోగశాల. మేక్ ఇన్ తెలంగాణ అనే ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు ప్రతీక.
కేసీఆర్ అద్భుతమైన ఆలోచనల్లోంచి పుట్టిన ఈ వేదిక, నేడు యువత చేతుల్లో ఒక గొప్ప సాంకేతిక శక్తిగా మారింది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్టార్టప్‌లకు కేవలం మాటల ప్రోత్సాహానికే పరిమితం కాలేదని, వారికి ప్రపంచస్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అత్యాధునిక టెక్నాలజీతోపాటు ఇన్నోవేషన్‌కు పూర్తి స్వేచ్ఛను కల్పించిందని గుర్తుచేశారు.
నేడు దేశం మొత్తం డ్రోన్లు, డిఫెన్స్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగాల గురించి మాట్లాడుకుంటున్నదని, అయితే తెలంగాణలో ఆ బీజం ఎన్నో ఏండ్ల క్రితమే కేసీఆర్ నాయకత్వంలో పడిందని స్పష్టంచేశారు. ‘దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్ సెంటర్‌ను హైదరాబాద్‌కు తీసుకొ చ్చి, మన నగరాన్ని గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా నిలబెట్టిన దూరదృష్టి ముమ్మాటికీ కేసీఆర్‌దే’నని పేర్కొన్నారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న టీ-వర్స్ సంస్థ.. తెలంగాణ అభివృద్ధి ఎంత ముందుచూపుతో, ప్రణాళికాబద్ధంగా సాగిందో మరోసారి నిరూపిస్తున్నదని తెలిపారు.