Jeevan Reddy | జగిత్యాల, ఏప్రిల్ 15: కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న వారిలో వీ హన్మంతరావు ఒక్కరే తనకన్నా సీనియర్ అని, జానారెడ్డి కూడా తన తర్వాత నాలుగేండ్లకు పార్టీలో చేరినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశానని, ఇప్పుడు పార్టీలో తన స్థానం, తన సీనియారిటీ ఏంటని ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘కాంగ్రెస్ అంటే జీవన్‌రెడ్డి.. జీవన్‌రెడ్డి అంటే కాంగ్రెస్’ అని అంటారని పేరొన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నానని, ఏమాత్రం తొనకకుండా, కాంప్రమైజ్ కాకుండా పదేండ్లు ఒంటరి పోరాటం చేశానని గుర్తుచేశారు.
పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క ఎంత పోరాడారో శాసన మండలిలో ఏకైక సభ్యుడిగా తానూ అంతే పోరాటం చేశానని తెలిపారు. 2014లో బీఆర్ఎస్ ప్రభంజనాన్ని తట్టుకుని జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలువడమే కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి మూడు జిల్లాల్లో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేసి పార్టీ పటిష్టతకు పాటుపడ్డానని గుర్తుచేశారు. 2019లో ఎన్నికై ఇటీవలి మార్చి వరకు ఆరేండ్లు శాసన మండలిలో ఏకైక కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా బీఆర్ఎస్పై పోరాటం చేసినట్టు చెప్పారు. పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోందని విలేకరులు అడిగిన ప్రశ్నకు 40ఏండ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా.. ఎందుకు మారుతానని ఎదురు ప్రశ్న వేశారు.