హైదరాబాద్, అక్టోబర్ 30(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో టికెట్ల కయ్యం రోజురోజుకు ముదురుతోంది. ఏండ్ల తరబడి పార్టీ జెండా మోసిన వారిని కాదని ప్యారాచూట్ నేతలకు టికెట్ల ఇవ్వడంపై సీనియర్లు రగిలిపోతున్నారు. అనుబంధ విభాగాల నేతలతోపాటు పీసీసీ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్, ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్ కోదండరెడ్డి వంటివారు అభ్యర్థుల ఎంపికపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్, హైదారాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ అసంతృప్తులు నిరసనల బాట పట్టారు. పార్టీ ఇప్పటి వరకు ప్రకటించిన 100 సీట్లలో 50కిపైగా రేవంత్‌రెడ్డి అమ్ముకున్నారని టీపీసీసీ బహిష్కృతనేత డాక్టర్ కురువ విజయ్‌కుమార్ ఆరోపిస్తూ ‘రేవంత్ రెడ్డి హఠావో.. కాంగ్రెస్ బచావో’ పేరుతో వాల్‌పోస్టర్ విడుదల చేశారు. కరీంనగర్ టికెట్ ఆశించి భంగపడిన గంగాధర సింగిల్ విండో మాజీ చైర్మన్ కొత్త జైపాల్‌రెడ్డి మంగళవారం బీఆర్ఎస్లో చేరుతున్నారు.
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ స్థానాన్ని తనకు కాకుండా శ్రీహరికి కేటాయించడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి తనయుడు ప్రశాంత్‌రెడ్డి నిర్వహించిన సమావేశానికి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వర్ధన్నపేట టికెట్‌పై కాంగ్రెస్ అధిష్ఠానం పునరాలోచించాలని ఆ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్చార్జి నమిడ్ల శ్రీనివాస్ కోరారు.
రెండు నెలల క్రితం పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తూ కోమటిపల్లిలోని తన నివాసంలో ముఖ్యకార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహిచారు. టికెట్ విషయంలో అధిష్ఠానం పునరాలోచించకుంటే కార్యకర్తల నిర్ణయం మేరకు నడుచుకుంటానని చెప్పారు.కాంగ్రెస్ ఇప్పటి వరకు విడుదల చేసిన రెండు జాబితాల్లో కలిపి మొత్తం 30 మంది కొత్తవారికి టికెట్లు ఇచ్చింది. సీనియర్ నేతలు జీ నిరంజన్, కోదండరెడ్డి దీనిని వ్యతిరేకిస్తూ పార్టీ జాతీయ అధక్షుడు మల్లికార్జునఖర్గేకు లేఖ రాశారు.
బలిపశువులుగా అనుబంధ సంఘాలు
టికెట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నేతలు బలిపశువులుగా మారారు. అనుబంధ సంఘాల నేతల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా టికెట్ దక్కలేదు. బల్మూరి వెంకట్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, మోతా రోహిత్, నూతి శ్రీకాంత్‌గౌడ్, అన్వేష్‌రెడ్డి వంటి నేతలకు టికెట్ దక్కలేదు.
పాలమూరు డీసీసీ కార్యాలయం ధ్వంసం
మహబూబ్‌నగర్ టౌన్, అక్టోబర్ 30: కాంగ్రెస్ అసమ్మతి కార్యకర్తల దాడిలో పాలమూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ధ్వంసమైంది. బీసీ నేత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌గౌడ్‌ను కాదని జీ మధుసూదన్‌రెడ్డి(జీఎంఆర్)కి దేవరకద్ర టికెట్ ఇవ్వడంతో కార్యకర్తలు, నేతలు సోమవారం డీసీసీ కార్యాలయం వద్ద హంగామా చేశారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యాలయంలోకి చొరబడి బ్యానర్లను చించేశారు. కుర్చీలను ధ్వంసం చేసి తగలబెట్టే ప్రయత్నం చేశారు. తమ నేత ప్రదీప్గౌడ్కు టికెట్ ఇవ్వకుంటే పార్టీని ఓడిస్తామని శపథం చేశారు. డీసీసీ కార్యాలయంలో ప్రదీప్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలో 30 ఏండ్లుగా పార్టీ కోసం సేవ చేస్తున్న తనకు కాదని వార్డు సభ్యుడిగా కూడా గెలవని జీఎంఆర్‌కు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దేవరకద్ర అభ్యర్థిని మార్చకపోతే కార్యకర్తలతో చర్చించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని హెచ్చరించారు.