హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : పంచాయతీ ఎన్నికల్లో గుర్తును పూర్తిగా తెలుగు అక్షర క్రమం ఆధారంగా కేటాయిస్తారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో తమ పేరును ఏ విధంగా పేరొంటే.. ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే ప్రాధాన్య క్రమం ఉంటుంది. ఇది అభ్యర్థులు తమ బ్యాలెట్ స్థానాన్ని ప్రభావితం చేయడానికి ఉపయోగించే ఒక వ్యూహం. సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం 30 ప్రత్యేక గుర్తులను, వార్డు స్థానాల కోసం 20 గుర్తులను కేటాయించింది. అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే ‘నోటా’ గుర్తు కూడా అందుబాటులో ఉంటుంది.
ప్రజలు నిత్యజీవితంలో ఉపయోగించే వస్తువులనే గుర్తులుగా కేటాయించింది. సర్పంచ్ అభ్యర్థుల కోసం గులాబీ రంగు బ్యాలెట్ పేపర్ ముద్రించి సిద్ధంగా ఉంచారు. తొలివిడత నామినేషన్ల ప్రక్రి య, పరిశీలన పూర్తయ్యాయి. ఇప్పుడు బరిలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ఖరారు చేసేందుకు ఎన్నికల సంఘం కీలక ఘట్టాన్ని పూర్తి చేయనున్నది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. తొలి విడతలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఈనెల 3న మధ్యాహ్నం 3 గంటల వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉన్నది. ఈ గడువు ముగిసిన వెంటనే పోటీలో మిగిలిన అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. తొలి విడత ఎన్నికలకు ఈనెల 11న పోలింగ్, అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.