అమృత్‌సర్‌లో మార్షల్‌లా అమలు అందరికీ తెలుసు. అలాంటిదే మరోచోటా జరిగింది. అది మరుగునపడిన చరిత్ర. శాంతియుతంగా మొదలైన శాసనోల్లంఘన.. గాంధీ అరెస్టుతో తీవ్రమైనరూపం దాల్చి షోలాపూర్‌లో తిరుగుబాటునే లేవదీసింది.
ఉప్పుసత్యాగ్రహానికి నాయకత్వం వహించి, శాసనోల్లంఘనకు పాల్పడినందుకు 1930 మే 5న గాంధీజీని ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆ అరెస్టును నిరసిస్తూ దేశమంతటా ఆందోళనలు మిన్నంటాయి. ఆ రోజు షోలాపూర్ ప్రజలను పోలీసులు రెచ్చగొట్టారు. విచక్షణారహితంగా లాఠీచార్జీ చేశారు. దీంతో ప్రజలు రోడ్లకు అడ్డంగా బారికేడ్లు నిర్మించి, పోలీసు బలగాలను ఎదిరించారు. చివరికది ఒక తిరుగుబాటుగా పరిణమించింది. 50వేల మంది కార్మికులు వీధుల్లోకి వచ్చారు. సారా దుకాణాలను ధ్వంసం చేశారు. పోలీస్ స్టేషన్ల మీద, కోర్టుల మీద దాడిచేశారు. స్థానిక కాంగ్రెస్ కమిటీ యుద్ధ సమితిని నెలకొల్పింది.
బ్రిటిష్ వాళ్లు తలదాచుకున్న భవనాలను తిరుగుబాటుదారులు తగులబెట్టారు. నగర పాలక సంస్థ భవనంపై జాతీయ కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. తర్వాత రైల్వేస్టేషన్‌ను ముట్టడించారు. వీధుల్లో సాయుధ పోరాటాలు జరిగాయి. వారంపాటు పట్టణం ప్రజల స్వాధీనంలో వుంది. తిరుగుబాటును అణచివేసేందుకు మే 16న రెండు వేలమంది బ్రిటిష్ సైనికులు షోలాపూర్ నగరంలోకి ప్రవేశించారు. ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన మల్లప్ప ధన్శెట్టితోపాటు మరో ముగ్గురిని పట్టుకుని ఉరి తీశారు. వేలాదిమందిని జైళ్లకు పంపారు. షోలాపూర్ తిరుగుబాటు ఎక్కువ రోజులు నిలువకపోయినా.. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదిపింది!