జగిత్యాల : భారతదేశ ఖ్యాతిని నలుదిశలా చాటి చెప్పిన స్వామి వివేకానంద ఆశయాలు ఆదర్శనీయమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. వివేకానంద జయంతి ,జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పట్టణంలోని 45వ వార్డులో వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వివేకానంద ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ప్రతి యువత వారి నైపుణ్యాలను తెలుసుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.
జగిత్యాల మినీ స్టేడియానికి స్వామి వివేకానంద స్టేడియంగా నామకరణం చేశామని వెల్లడించారు. అనంతరం పట్టణంలోని శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల వారి అధ్వర్యంలో నేషనల్ యూత్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
జగిత్యాల లో మెడికల్ కళాశాల ఏర్పాటుతో వైద్య విద్యార్థులు వారి తల్లిదండుల్రు ఎంతగానో సంతోషంతో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ డాక్టర్ నరేశ్ , కౌన్సిలర్ బోడ్ల జగదీశ్, టౌన్ సీఐ కిషోర్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.