ఖైరతాబాద్, డిసెంబర్ 11: ఫోర్జరీ పత్రాలు తయారు చేయించి జీ శ్రీనివాస్ అనే వ్యక్తి తన తాత ఆస్తిని కబ్జా చేయడమే కాకుండా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడని దివంగత సీనియర్ నటుడు ఎస్వీ రంగారావు మనుమడు ఎస్వీ రంగారావు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన మీడియా ఎదుట వివరాలు వెల్లడించారు. తన తాత ఎస్వీ రంగారావు 1966లో మాసబ్‌ట్యాంక్‌లోని శాంతినగర్ కాలనీలో 446 చదరపు గజాల స్థలం కొనుగోలు చేశారని చెప్పారు. 1974లో ఆయన మరణానంతరం వారసత్వంగా తన నానమ్మ లీలావతి, తండ్రి కోటేశ్వర్రావు, ఆయన ఇద్దరు కుమార్తెలకు సంక్రమించిందని తెలిపారు. 1995లో తన కుటుంబం ఆ ఆస్తిని జీ శ్రీనివాస్ అనే వ్యక్తికి నెలవారీ కిరాయికి ఇచ్చిందని, కొంత కాలానికి ఆయన కిరాయి చెల్లించడం మానేశాడని చెప్పారు. దీంతో 1998లో కోర్టును ఆశ్రయించగా తక్షణమే ఒప్పందం ప్రకారం పెండింగ్‌లో ఉన్న కిరాయి డబ్బు చెల్లించడంతో పాటు వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించిందని వివరించారు.
ఆ తర్వాత 2002లో ఫోర్జరీ సంతకాలతో పత్రాలు తెచ్చి మళ్లీ కోర్టులో సమర్పించి కబ్జా ప్రయత్నాలు మొదలు పెట్టాడని చెప్పారు.తప్పుడు అడ్రస్‌లతో నోటీసులు పంపడమే కాకుండా, తాము కోర్టుకు హాజరవడం లేదని, తమను ఎక్స్‌పార్టీగా చేసి న్యాయస్థానం ద్వారా ఆస్తిని అతని పేరిట మార్చుకున్నాడని తెలిపారు. దీనిపై 2008లో సీసీఎస్‌లో ఫిర్యాదు చేశామని వివరించారు. తాజాగా తమ స్థలంలో భవనాల నిర్మాణం చేపడుతున్నాడని, దీనిపై కోర్టును ఆశ్రయించడంతో పాటు తమ చేతి వేలి ముద్రల విషయంలో ఫోరెన్సిక్ ల్యాబ్‌లో సంప్రదించగా అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్‌గా గుర్తించారని, తక్షణమే నిర్మాణాలను నిలుపుదల చేయాలని ఆదేశించారని, సీసీఎస్ పోలీసులు చార్జిషీట్ సైతం సిద్ధం చేశారని తెలిపారు.
ఈ విషయంపై కోర్టును ఆశ్రయిస్తే ఇంజక్షన్ ఆర్డర్, స్టేటస్కో ద్వారా ఈ ఆస్తిని అమ్మవద్దని, కొత్త నిర్మాణాలు చేపట్టవద్దని నిరుడు జూలై 19న ఆదేశాలు జరీ చేసిందని చెప్పారు. ఆ ఆదేశాలు, తీర్పులను బేఖాతరు చేస్తూ మళ్లీ నిర్మాణాలు చేపడుతున్నాడని తెలిపారు. నిర్మాణాలు ఆపాలని కోరితే దాడులకు పాల్పడుతున్నాడని వాపోయారు. రెండు రోజుల క్రితం అడిషనల్ డీసీపీ ఆనంద్ తమను సైఫాబాద్ పీఎస్‌కు పిలిపించుకొని తక్షణమే ఆస్తిని వదిలేయాలని, కబ్జాదారుడు శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా వెళ్లవద్దని, లేదంటే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైల్లో పెడుతానని బెదిరించాడని ఆవేదన వ్యక్తంచేశారు.
కోర్టు ధిక్కరణకు పాల్పడిన వ్యక్తికి ఓ పోలీసు ఉన్నతాధికారి వత్తాసు పలకడం బాధాకలిగించిందని, న్యాయబద్ధంగా తమ ఆస్తిని తాము అడిగితే పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసి తమను జైల్లో పెట్టించాలని చూస్తున్నాడని వాపోయారు. సదరు వ్యక్తితో తమకు ప్రాణహాని ఉన్నదని, ప్రభుత్వం రక్షణ కల్పించాలని వేడుకున్నారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తిగా నమ్మకం ఉన్నదని చెప్పారు.