హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ) : సరోజినీదేవి కంటి దవాఖానలోని సీఎంఎస్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంలో కాలి బూడిదైనవి కాలం చెల్లిన మందులా? లేదా కొత్తగా కొనుగోలు చేసినవా? అనే వివరాలను అధికారులు వెల్లడించడం లేదు. జరిగిన నష్టంపై టీజీఎంఎస్ఐడీసీ నివేదిక విడుదల చేయడం లేదు. దీంతో తమ అవినీతి బయటపడకుండా ఉండేందుకు అక్రమార్కులు అగ్నిప్రమాదం నాటకం ఆడారని అనుమానిస్తున్నారు. ఏసీలో మంటల వల్లే ఇదంతా జరిగిందని చెప్తున్నా.. ప్రమాద ఘటనను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రమాదంపై గోప్యత
మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి దవాఖానలో గత నెల 30న అగ్నిప్రమాదం సంభవించింది. దవాఖాన గ్రౌండ్‌ఫ్లోర్‌లోని సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్‌లో ప్రమాదం జరిగింది. పక్కనే ఓపీ విభాగం, ఎమర్జెన్సీ విభాగంతోపాటు ఇన్‌పేషంట్ వార్డులోని రోగులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి రెండు గంటలపాటు శ్రమించి మంటలు ఆర్పేశారు. ఇండోర్ ఏసీ యూనిట్ పేలిపోవడంతో ఘటన జరిగినట్టు అధికారులు చెప్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి సీఎంఎస్, అధికార వర్గాలు గోప్యత పాటిస్తున్నాయి. ప్రమాదం జరిగి దాదాపు రెండు వారాలు కావస్తున్నా, ఈ రోజువరకు ఎన్ని మందులు కాలిపోయాయి, ఏయే రకాల మందులు ఆహుతయ్యాయనే నివేదికను విడుదల చేయలేదు. దీంతో కాలిపోయిన మందులేమిటనే కోణంలో ప్రస్తుతం చర్చ జరుగుతున్నది.
కాలం చెల్లిన మందులేనా?
ప్రజారోగ్యానికి అత్యంత కీలకమైన మందుల కొనుగోలులో భారీ అవినీతి జరిగినట్టు ఆరోపణలు వచ్చిన వెంటనే సీఎంఎస్‌లో అగ్ని ప్రమాదం జరుగడంపై ఆ శాఖలోనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మందుల కొనుగోళ్లు ఎంతలా జరిగాయంటే.. వాటిని పెట్టడానికి గోదాములు కూడా సరిపోవడం లేదని స్టోర్స్ వర్గాలే ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. దీంతో కాలం చెల్లిన వాటిని ధ్వంసం చేయడానికి అధికారులు సిద్ధమై, ఓ సంస్థకు రూ.కోట్లు వెచ్చించి కాంట్రాక్టు కూడా ఇచ్చారు. ఈ బాగోతాన్ని ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే తమ తప్పును కప్పిపుచ్చుకొనేందుకు అగ్ని ప్రమాదాన్ని సృష్టించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాలిబూడిదైనవి ఎక్స్పైరీ మందులేనని ఆనుమానిస్తున్నారు. గోదాములో పెద్దఎత్తున మిగిలిపోయిన, కాలం చెల్లిన మందులను లెక్క నుంచి తప్పించేందుకే అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఈ పథకం వేశారని సీఎంఎస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది. అందుకే నష్టం వివరాలను వెల్లడించడం లేదని చెప్తున్నారు.