తెలంగాణలో పలువురు కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైనట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. పక్కా పథకం ప్రకారం.. శుక్రవారం రాత్రి హైదరాబాద్ నగర శివారులోని ఒక యువ ఎమ్మెల్యేకు చెందిన ఫాంహౌస్‌లో జరిగిన సీక్రెట్ డిన్నర్లో వీరంతా కలిసినట్టు తెలుస్తున్నది. ఉమ్మడి నల్లగొండ, పాలమూరు జిల్లాలకు చెందిన పది మంది ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరైనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.త్వరలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఇంతటి కీలక సమయంలో జరిగిన ఈ భేటీ వెనుక కాంగ్రెస్ పార్టీకే చెందిన ఒక కీలక నేత ప్రోద్బలం ఉండి ఉండవచ్చుననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Congress | హైదరాబాద్ జనవరి 31(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తు మీద ప్రధానంగా అసంతృప్త ఎమ్మెల్యేలు చర్చించినట్టు తెలిసింది. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందడం లేదని, ఎమ్మెల్యేల వ్యాపార లావాదేవీల్లోనూ ముఖ్యనేత సోదరులతోపాటు కీలక మంత్రులు వాటాల కోసం వేధిస్తున్నారని, కాంట్రాక్టు బిల్లుల చెల్లింపుల్లో 14% కమీషన్లు లేకుండా ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదనే అంశాలు ఎమ్మెల్యేల మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహం మీద కూడా చర్చించినట్టు సమాచారం. ఇటీవల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి తన వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి 25 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని, రిపోర్టులు తమ వద్ద ఉన్నాయని సీఎం రేవంత్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఒక వర్గం ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. వారితో సాన్నిహిత్యం ఉన్న ఎమ్మెల్యేలు వీలును బట్టి వారిని కలుస్తూ అభిప్రాయాలు తీసుకోవాలని, కలిసి వచ్చే వారిని కలుపుకొని పోవాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది.
40% వాటాలు,14% కమీషన్లు
ఇటీవల ప్రైమ్ ప్రాంతంలో ఉన్న భూ వివాదం కేసు విషయంలో రికార్డుల పరమైన పరిష్కారాల కోసం నంబర్-2గా చెప్పుకుంటున్న దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రిని కలవగా, సద రు మంత్రి 40% వాటా అడిగారని ఒక ఎమ్మెల్యే వాపోయినట్టు తెలిసింది. తాను ఇవ్వడానికి నిరాకరించడంతో ఇంత భూమిని నువ్వొక్కనివే ఏం చేసుకుంటావంటూ ఎదురు ప్రశ్నించారని, ఆ మంత్రి తమ వ్యాపార లావాదేవీల్లో కూడా 40% వాటా అడుగుతున్నారనే విషయాన్ని ముఖ్యనేత దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన కూడా ఎంతోకొంత చూసి ఇవ్వుపోరాదా? అని చెప్పారంటూ ఆ ఎమ్మె ల్యే తన అనుభవాన్ని సహచరులకు వివరించినట్టు తెలిసింది. మరో మంత్రి అయితే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా కమీషన్లు వసూలు చేస్తున్నారని, తాము సిఫారసు చేసిన కాంట్రాక్టు బిల్లులకు కూడా 14% కమీషన్ తీసుకుంటున్నారని చర్చించినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లో నిర్వహించిన ఆన్లైన్ పోలింగ్‌లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలననే తిరిగి కోరుకోవడం, ఆ మరుసటి దినమే పది మంది అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ కావడం వంటి పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్నది.
వెంటాడిన నిఘా వర్గాలు
దక్షిణ తెలంగాణకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు భేటీ కావాలని మూడు రోజుల కిందటే నిర్ణయించుకున్నారని, హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో వారి సమావేశం కావొచ్చునని ఇంటెలిజెన్స్ వర్గాలకు ఉప్పందినట్టు విశ్వసనీయంగా తె లిసింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెంది న ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద స్వరం పెంచి మాట్లాడుతున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయని సమాచారం. దీంతో హైరానా పడ్డ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారి ఒకరు నిఘా పెట్టినట్టు తెలిసింది. భేటీ కాబోయే అసంతృప్త ఎమ్మెల్యేలను గుర్తించి, వారి ని బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేసినట్టు తెలిసింది. నిఘా వర్గాలకు విషయం తెలియడంతో నలుగురు ఎమ్మెల్యేలు వెనుకడుగు వేసినట్టు స మాచారం. మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు మాత్రం భేటీ వేదికను హోటల్లో కాకుండా పారిశ్రామికవేత్త, యువ ఎమ్మెల్యే ఫాంహౌజ్‌కు మార్చినట్టు తెలిసింది.