హైదరాబాద్, మార్చి 27(నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించిన రైతుభరోసా నిధులకు సర్కార్ కోత పెట్టిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్ బుక్‌లో రైతుభరోసా కోసం రూ.18వేల కోట్లు కేటాయించామని పేర్కొన్నది. కానీ, బుధవారం వ్యవసాయ శాఖ పద్దుపై జరిగిన చర్చలో భాగంగా పద్దు పుస్తకంలో రూ.13,603 కోట్లు మాత్రమే కేటాయించినట్టు తెలిపింది. ‘ఈ పథకం కింద ఎకరాకు సంవత్సరానికి రూ.12వేల చొప్పున సహాయం అందించడానికిగానూ 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రూ.13,603 కోట్లు కేటాయించడం జరిగింది’ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడించారు. బడ్జెట్ పుస్తకంలో ఒకలా, వ్యవసాయ పద్దుల పుస్తకంలో మరోలా రైతుభరోసా నిధులను పేర్కొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ బడ్జెట్ అంతా అంకెల గారడీ.. లెక్కల తారుమారు అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఇప్పుడు రైతుభరోసా లెక్కలు ప్రతిపక్షాల విమర్శలకు బలం చేకూర్చుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ రంగాలకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించినట్టు చూపిస్తున్నప్పటికీ, వీటిని ఏవేవో పద్దుల కింద చూపిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుభరోసాకు వ్యవసాయ పద్దులోనే నిధులు కేటాయించారా? లేక మరే పద్దులోనైనా నిధులు కేటాయించారా? అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో ప్రధానమైన వ్యవసాయ పద్దును పరిగణనలోకి తీసుకుంటే రైతుభరోసాకు రూ.13,603 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. ప్రభుత్వం చెప్పినదానికన్నా రూ.4,397 కోట్లు కోత పెట్టడం గమనార్హం. ఇదే జరిగితే వచ్చే ఏడాది ఏదో ఒక సీజన్లో రైతుభరోసాకు కోత పెట్టడం ఖరారైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సర్కార్ లెక్కల ప్రకారమే రైతుభరోసా పంపిణీకి ఒక సీజన్‌కు రూ.9వేల కోట్లు అవసరం. రెండు సీజన్లకు రూ.18వేల కోట్లు అవసరం. కానీ, ప్రభుత్వం రూ.4,397 కోట్లు తక్కువగా చూపించడంతో రెండో సీజన్లో సగం మంది రైతులకే రైతుభరోసా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ ఒక సీజన్ రైతుభరోసాను పూర్తిగా ఎగ్గొట్టగా, మరో సీజన్లో సగమే పంపిణీ చేసింది. ఇక ఈ సీజన్లో ప్రస్తుతం రైతులందరికీ ఒక్క ఎకరం వరకు పం పిణీ చేసింది. ఇక మిగిలిన ఎకరాలకు, మిగిలిన రైతులకు పంపిణీ చేస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకమే.
సబ్సిడీ విత్తనాల పంపిణీని ప్రభుత్వం అమలు చేయడంలేదు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వడంలేదు. ఈ రెండు పథకాలకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడం గమనార్హం. పంటల బీమా పథకం కోసం రూ.981 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు పంటల బీమా పథకం పట్టాలెక్కలేదు. ఈ పథకాన్ని అమలు చేయాలంటే రూ.3,500 కోట్లు అవసరమని అంచనా. కానీ, ప్రభుత్వం నామమాత్రంగా నిధులు కేటాయించి చేతులు దులిపేసుకున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోనీ రెండేండ్లుగా అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకే ఏమైనా పరిహారం అందించిందా.. అంటే అదీ లేదు. కామారెడ్డి, వరంగల్‌లో స్వయంగా సీఎం రేవంత్ పర్యటించి రైతులకు మాట ఇచ్చి, పరిహారం మాత్రం విడుదల చేయలేదు. ఇక అమలు చేయని విత్తనాల పంపిణీకి రూ.109.32 కోట్లు కేటాయించడం గమనార్హం. ఇదిలా ఉంటే యాంత్రీకరణ కోసం రూ.100 కోట్లు కావాల్సి ఉండగా, రూ.25.47 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం.