Suspension | హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ సమావేశాల్లో ఆదివారం అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. అవినీతిపై సమాధానం చెప్పలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసింది. అసెంబ్లీ సెషన్ ముగిసేవరకూ సమావేశాలకు హాజరుకాకుండా బహిష్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై అక్రమ మైనింగ్‌కు సంబంధించిన వ్యవహారాలను బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధారాలు సహా సభలో బయటపెట్టారు. కంపెనీ అవినీతి, అక్రమాలపై విచారణ జరిపేందుకు హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. కానీ, ప్రభుత్వం మాత్రం సీబీసీఐడీ విచారణ మాత్రమే జరుపుతామని ప్రకటించింది. హౌస్ కమిటీ ఏర్పాటు చేసేది లేదంటూ తేల్చిచెప్పింది. తప్పు చేయనప్పుడు భయమెందుకు అంటూ బీఆర్ఎస్ నిలదీస్తున్నది. ఆదివారం ఉదయం సభ ప్రారంభం కాగానే మళ్లీ ఇదే విషయాన్ని బీఆర్ఎస్ సభ్యులు లేనెత్తారు.
మాట్లాడేందుకు సైతం స్పీకర్ అనుమతివ్వలేదు. దాదాపు 4 గంటలపాటు బీఆర్ఎస్ సభ్యులు తమ సీట్ల నుంచి లేచి నినాదాలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ హౌస్ కమిటీ వేసేది లేదంటూ స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి తెగేసి చెప్పారు. అంతేకాకుండా బడ్జెట్ పద్దులపై చర్చ కొనసాగించేందుకు బీఆర్ఎస్ సభ్యులను ప్రస్తుత అసెంబ్లీ సెషన్ ముగిసేవరకు సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరారు. తదనంతరం శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ మేరకు సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రతిపాదించారు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితాఇంద్రారెడ్డి, సభ్యులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, సంజయ్, అనిల్జాదవ్లను సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. తదుపరి స్పీకర్ ప్రసాద్‌కుమార్ బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు.
టార్గెట్ కౌశిక్‌రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్ నిర్ణయించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అసభ్యంగా ప్రవర్తించారని ప్రభుత్వపక్ష నేతలు ఆరోపించారు. సభాసంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ రాద్ధాంతానికి దిగారు. అక్కడితో ఆగకుండా ఈ అంశంపై విచారణ చేసి, తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేసేందుకు ఎథిక్స్ కమిటీని ఏర్పాటుచేయాలని ప్రభుత్వపక్ష నేతలు పట్టుబట్టారు. ముఖ్యమంత్రి సైతం కోరారు. మంత్రి శ్రీధర్‌బాబు తీర్మానం పెట్టి ఆమోదించగా ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.