
సూర్యాపేట టౌన్: మత్స్యకారుల జీవితాల్లో నూతన వెలుగులు నింపాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని ఆయన వెల్లడించారు. అందులో భాగం గానే రాష్ట్ర వ్యాప్తంగా 34,024 చెరువులను చేపల పెంపకానికి అనువుగా గుర్తించినట్లు మంత్రి ప్రకటించారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చేపల పెంపకంలో భాగంగా గురువారం ఉదయం ఆరో విడుత చేపల పెంపకాన్ని సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండల పరిధి నెమ్మికల్లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడు తూ ఉచిత చేపల పెంపకంతో మత్స్యకారులకు ఆర్థిక పరిపుష్టి కల్గించవచ్చన్నారు. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను బలోపేతం చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందని సీఎం గుర్తించారన్నారు

అందులో భాగంగానే ఆరో విడుత చేపల పెంపకాన్ని 34,024 చెరువుల్లో రూ.89 కోట్ల అంచనా వ్యయంతో 93 కోట్ల చేప పిల్లల పెంపకం జరుగు తున్నదని ఆయన చెప్పారు. అంతేకాకుండా 25 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా రూ.10 కోట్లకు పైచిలుకు రొయ్యల పెంపకం ఉంటుంద న్నారు. చేపల పెంపకంతో రాష్ట్రంలో నీలి విప్లవం తీసుకురావాలి అన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, ఎంపీపీ మర్ల స్వర్ణలత, పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, తూడి నర్సింహా రావు, మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, బెల్లంకొండ యాదగిరి, బొల్లె జానయ్య, ఈదుల యాదగిరి, మత్స్యశాఖ అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.