హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా పిచ్చిమాటలు మానుకొని.. నిబద్ధతతో పాలన సాగించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి హితవుపలికారు. తెలంగాణకు కాంగ్రెస్ సర్కారు చేసిందేమీ లేదని, అందుకే రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లేని గొప్పలు చెప్పుకోవడం ఆయనకు అలవాటేనని, నానాటికీ సీఎం స్థాయిని మరిచి, సంసారం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘మాది నీళ్ల దందా.. రైతు దందా అయితే, మీది కమీషన్ల దందా.. ప్లాట్ల దందా’ అంటూ ఘాటుగా విమర్శించారు. తాను రేవంత్‌రెడ్డి స్థాయికు దిగజారి మాట్లాడలేనని, తనకు సంస్కారం ఉన్నదని చెప్పారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రేషన్‌కార్డుల పంపిణీ పేరుతో తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన సభకు ప్రభుత్వ ఖర్చుతో జనాలను తీసుకొచ్చారని, సీఎం ఎంత మొత్తుకున్నా సభలో జనం నుంచి స్పందన రాలేదని, సీఎం అబద్ధాలు మాట్లాడుతుంటే ప్రజలు ఎందుకు స్పందిస్తారని నిలదీశారు. సీఎం మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రేషన్‌కార్డులు ఇవ్వలేదని రేవంత్ అబద్ధాలు మాట్లాడుతున్నారని, తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో 6,47,479 కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేశామని గుర్తుచేశారు. 2021, జూలైలో ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార తన నియోజకవర్గంలో రేషన్ కార్డులు పంచినట్టు ట్వీట్ చేశారని, ఇప్పటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాజీ ఎంపీగా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు రేషన్ కార్డుల పంపిణీపై ట్వీట్ చేశారని, చౌటుప్పల్‌లో అప్పటి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో తాను రేషన్ కార్డులు పంపిణీ చేశానని గుర్తుచేశారు.
తిట్లు తప్ప ఏవీ ఇవ్వలే
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లవుతున్నా రేషన్‌కార్డుల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని రేవంత్‌రెడ్డి సెలవిచ్చారని, అయితే, ఇది ఎకువ కాలం పాలించిన కాంగ్రెస్ వైఫల్యం వల్ల కాదా? అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. గతంలో సీఎం హోదాలో కేసీఆర్ జిల్లా పర్యటనలకు వచ్చినపుడు కొత్త కార్యక్రమాలు ప్రకటించేవారని, కానీ, రేవంత్‌రెడ్డి తుంగతుర్తిలో తిట్లు తప్ప ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ పాలన వల్లే నల్లగొండలో ఫ్లోరోసిస్ మహమ్మారి రెండు లక్షల మందిని కబళించిందని ఆవేదన వ్యక్తంచేశారు. మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పం డించే నల్లగొండను 40లక్షల మెట్రిక్ టన్నుల స్థాయికి తీసుకెళ్లింది కేసీఆర్ కాదా? అని నిలదీశారు. నల్లగొండ జిల్లాలో వ్యవసాయాన్ని కేసీఆర్ పండగలా మార్చారని, కాంగ్రెస్ వచ్చాక ఒక ఎకరాకైనా అదనంగా నీళ్లిచ్చిందా? అని ప్రశ్నించారు. తుంగతుర్తి నియోజకవర్గ కాలువల్లో పారుతున్న కాళేశ్వరం జలాలకు లక్ష హారతులు ఇచ్చిన న్యూస్ క్లిప్పింగ్‌ను జగదీశ్‌రెడ్డి మీడియాకు చూపించారు.
బంకులు, బస్సుల యజమానులెవరు?
మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఉద్యోగాల భర్తీ విషయంలో రేవంత్‌రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. లక్ష మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారని, సభకు వచ్చిన మహిళల్లో బంకుల యజమానులు ఎవరు? బస్సుల యజమానులు ఎవరు? అని ప్రశ్నించారు. 50వేల ఉద్యోగాలిచ్చినం.. తలలు లెక్కబెడదామని అంటున్న రేవంత్.. ఎవరు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు వచ్చాయో ఆ తలలనే అనడగాలని చురకలంటించారు. రేవంత్‌లాగా గురుదక్షిణ కింద కృష్ణా, గోదావరి జలాలను తాము కిందకు తరలించలేదని మండిపడ్డారు. బనకచర్లపై చంద్రబాబు రాసిచ్చిన వాక్యాలనే రేవంత్ చదువుతున్నారని మండిపడ్డారు.
12కు పన్నెండు సీట్లు గెలుస్తం
‘నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ మహామహులనే మట్టికరిపించినం.. భవిష్యత్తులో నేనేంటో నిరూపిస్తా’ అని జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ నుంచి బీఆర్ఎస్ తరఫున నానొకడినే ఎమ్మెల్యేగా గెలిచానని, ఇప్పుడు ఎన్నికలు పెడితే 12కు పన్నెండు సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ‘ఒకోసారి మనం ఎంత మం చిగా పంటసాగు చేసినా, పంట కంటే లొట్ట పీసు చెట్లే ఎకువ మొలుస్తయి. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రూపంలో లొట్ట పీసు చె ట్లు మొలిచినయి’ అని ఎద్దేవా చేశారు. సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, నలమోతు భాసర్‌రావు, రవీంద్రకుమార్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత ఒంటెద్దు నరసింహారెడ్డి పాల్గొన్నారు.
రైతులకు రేవంత్ సర్కార్ 27 వేల కోట్ల బాకీ
స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసమే తాజా రైతు భరోసా వేశారని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. పాతది.. యాసంగిది, వానకాలానికి కలిపి రైతులకు రేవంత్ ప్రభుత్వం ఇంకా రూ.27 వేల కోట్లు బాకీ పడిందని చెప్పారు. నిన్న తుంగతుర్తిలో సీఎం వచ్చే కన్నా ముందు కూడా కాంగ్రెస్ నేతలు తన్నుకున్నారని, మళ్లీ ఫ్యాక్షన్ రోజులు తెస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో నల్లగొండలో ఎలాంటి రాజకీయ కక్షలకు సంబంధించిన కేసులు లేవని స్పష్టంచేశారు. ‘కార్యక్రమం ఏది అని చూడకుండా బఫూన్ సహా రేవంత్ అన్ని పాత్రలూ తానే వేస్తున్నారు’ అని విమర్శించారు. తన మాటలకు కట్టుబడి ఉన్నానని, కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌కు అప్పగిస్తే మూడు రోజుల్లో కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లు ఆన్‌చేసి నీళ్లిచ్చి చూపిస్తామని సవాల్ చేశారు.
మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే నల్లగొండను 40లక్షల మెట్రిక్ టన్నుల స్థాయికి తీసుకెళ్లింది కేసీఆర్ కాదా? నల్లగొండ జిల్లాకు వచ్చిన కాళేశ్వరం జలాలకు కేసీఆర్ హారతి ఇచ్చిన దృశ్యాలను మీరు చూడలేదా? మూడు మెడికల్ కళాశాలలను జిల్లాకు తెచ్చింది కేసీఆర్ కాదా? యాదాద్రిని అద్భుత దైవక్షేత్రంగా తీర్చిదిద్దింది కేసీఆర్ కాదా?
-జగదీశ్‌రెడ్డి
బీఆర్ఎస్ పాలనలో 6,47,479 కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేసినం. అప్పుడు భట్టి విక్రమార తన నియోజకవర్గంలో రేషన్ కార్డులు పంచినట్టు ట్వీట్ చేసిండ్రు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు రేషన్ కార్డుల పంపిణీపై ట్వీట్ చేసిండ్రు. నా వాదన తప్పని నిరూపిస్తే చెంపదెబ్బ కొట్టించుకోవడానికి నేను సిద్ధం. కాంగ్రెస్ నేతలు కూడా చెంపదెబ్బలు తినడానికి సిద్ధం కావాలి.
-జగదీశ్‌రెడ్డి