సూర్యాపేట, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : బీజేపీ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి శ్రీనివాస్‌గౌడ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధి పరుగులు తీస్తున్నదని అన్నారు. సూర్యాపేటను సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి జగదీశ్‌రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. కండ్ల ముందు కన్పిస్తున్న అభివృద్ధిని కాదనలేమని, ఒకవేళ రాజకీయపరంగా విమర్శిస్తే జనం అంగీకరించే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. సూర్యాపేటలో అసలు ప్రతిపక్షాలకు పని లేకుండా పోయిందని అన్నారు. ఇంత జరుగుతున్నప్పుడు ఇతర పార్టీల్లో ఉండటం కంటే మంత్రి జగదీశ్‌రెడ్డి కుటుంబంలోకి వెళ్లి, ఆయన అడుగుల్లో అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్టు రాపర్తి తెలిపారు. మంగళవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు.
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పని హామీలను సైతం అమలు చేసిన ఘనత మంత్రి జగదీశ్‌రెడ్డికే దక్కుతుందని తెలిపారు. మూసీ మురికి కూపం నుంచి విముక్తి కల్పించి స్వచ్ఛమైన జలాలను అందించిన ఘనత జగదీశ్రెడ్డిదేనని స్పష్టం చేశారు. త్వరలో మంత్రి సమక్షంలో కార్యకర్తలు, అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరుతానని ప్రకటించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు రాపర్తి రమేశ్, బీజేపీ యువమోర్చా పట్టణ ఉపాధ్యక్షుడు కెక్కిరేణి ఆనంద్, పట్టణ బీజేపీ నాయకులు రాపర్తి మహేశ్, కెక్కిరేణి శివకుమార్, రాపర్తి సంజయ్, గుండగాని కుమార్ పాల్గొన్నారు.