Water Problem | సూర్యాపేట, ఏప్రిల్ 29 : నెల రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉండటంతో సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని భాగ్యనగర్ వాసులు రోడ్డెక్కారు. సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. నెల రోజులుగా తమ ఇండ్లకు మంచినీళ్లు రావడంలేదని దీంతో తాగడానికి, కనీస అవసరాలు తీర్చుకునేందుకు ఇబ్బందికరంగా ఉందన్నారు. ఈ విషయాన్ని అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించినప్పటికీ ఎలాంటి ఫలితం లేదన్నారు. మేము అన్నం లేకుండా ఉంటాము కానీ మంచి నీళ్లు లేకుండా ఎలా ఉండాలని అధికారులను ప్రశ్నించారు. తమ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు అధికంగా ఉన్నారని అందుకే ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు మీరు ఓటుకు రూ 2000 తీసుకొని ఓటు వేశారంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
తమ ప్రాంతంలో తమ ఇండ్ల ముందు కాలువలు తీయమంటే కూడా రూ 100 నుంచి 200 రూపాయల వరకు డబ్బులు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రాంతంలో కాలువలు నిండిపోయి దుర్గంధం వెదజల్లుతున్న ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అలాగే ఉంటున్నామన్నారు. నెల రోజులుగా అధికారులు ప్రజాప్రతినిధులు వారి ఇండ్లలో నీళ్లు రాకుంటే ఎలా ఉంటారా అని ప్రశ్నించారు. సామాన్య ప్రజల సమస్యలు అంటే అధికారులకు ప్రజాప్రతినిధులకు పట్టింపు లేదని ఉన్నత అధికారులు స్పందించి తమ ప్రాంతంలో మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మండు వేసవిలో మంచినీటి ఎద్దడితో మా గొంతేండి చస్తామన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ధర్నా చేస్తున్న మహిళలను చెదరగొట్టారు.
.