హైదరాబాద్, జూన్ 30(నమస్తే తెలంగాణ): రైతు భరోసాలో కోతలకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. సాగులోలేని భూములకు పెట్టుబడి సాయం ఇవ్వబోమని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా భూముల సర్వే నిర్వహిస్తున్నది. ముఖ్యంగా మేజర్ గ్రామాలు, మండల, జిల్లా కేంద్రాలు, పట్టణ శివారు గ్రామాలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టింది. వీటి చుట్టుపక్కల ప్రాంతాల భూములపై ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తున్నది. రియల్ఎస్టేట్ వెంచర్లను పరిశీలిస్తున్నది. వాటికి అనుమతి ఉన్నదా? లేదా? ఆ భూములను కమర్షియల్ ప్లాట్‌గా విక్రయించారా? వ్యవసాయ భూమిగా విక్రయించారా? ప్రతి వెంచర్‌కు నాలా కన్వర్షన్ పూర్తయిందా? లేదా? తదితర వివరాలను సేకరిస్తున్నది. ఇప్పటికే రియల్ఎస్టేట్ వెంచర్లను ఏర్పాటు చేసి వాటిపై రైతుబంధు పెట్టుబడి సాయం తీసుకున్నారా? ఎప్పటినుంచి, ఎంత మొత్తం తీసుకున్నారు? అనే అంశాలపై లెక్కలు వేస్తున్నారు.
పట్టణ ప్రాంతాల చుట్టుపక్కల భూములతోపాటు గ్రామాల్లోని భూములపై కూడా ప్రభుత్వం సర్వే నిర్వహిస్తున్నది. గ్రామాల్లో సాగులోలేని భూములు, ముఖ్యంగా చెలకలు, కొండలు వంటి భూముల వివరాలు ఆరా తీస్తున్నది. ఆయా గ్రామాల్లో పంటలు సాగు చేయకుండా రైతుబంధు పెట్టుబడి సాయం పొందిన భూములు ఏ మేరకు ఉంటాయనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
వానకాలం సీజన్‌కు రైతు భరోసా పెట్టుబడి సాయం మరింత ఆలస్యం కానున్నది. సాధారణంగా వ్యవసాయ సీజన్ మొదలయ్యే జూన్‌లో పెట్టుబడి సాయం పంపిణీ ప్రారంభించాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకు షరతులు విధించాలని నిర్ణయించింది. విధి విధానాలను రూపొందించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటుచేసింది. జూలై 15లోపు నివేదిక ఇవ్వాలని సబ్ కమిటీకి సూచించింది. మరోవైపు రైతుల నుంచి కూడా అభిప్రాయాలను సేకరిస్తున్నది. మొన్నటి మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతుల నుంచి అభిప్రాయాలు స్వీకరించింది.
సబ్ కమిటీ ప్రతిపాదనలు, రైతుల అభిప్రాయాలను క్రోడీకరించి పూర్తిస్థాయిలో నివేదికను తయారుచేయనున్నది. రైతు భరోసా నిబంధనలపై అసెంబ్లీలో చర్చిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జూలై చివరి వారంలో జరిగే అవకాశం ఉన్నది. ఆ సమావేశాల్లో రైతుబంధుపై చర్చిస్తే.. అనంతరం అధికారులు అందుకు సబ్‌కమిటీ, రైతులు అభిప్రాయాలను క్రోడీకరించి పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేయాల్సి ఉంటుంది. దీనికి కనీసంగా పదిహేను నుంచి నెల రోజులు పట్టే అవకాశం ఉన్నది. దీంతో నిబంధనలు రూపొందించి రైతుల జాబితాను సిద్ధం చేసేలోగా ఆగస్టు కూడా గడిచిపోతుంది.
ఈ లెక్కన సెప్టెంబర్‌లో రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించే కార్యక్రమం మొదలుపెట్టే వీలుంటుంది. ఈ నేపథ్యంలో మొన్నటి యాసంగి మాదిరిగానే ఈ వానకాలం సీజన్లోనూ పంట కోతలు మొదలయ్యే వరకు కూడా రైతు భరోసా దక్కడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.