Congress Govt | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): మీకు హైదరాబాద్లో ఇల్లు ఉన్నదా? మీ ఇంటికి సమీపంలో చెరువు లేదా కుంటలు ఉన్నాయా? సమీపంలో కాకున్నా.. కనుచూపు మేరలో చెరువు, కుంట ఉన్నదా? మీరు ఇల్లు కట్టుకొని 20 ఏండ్లు దాటినా.. ఆ నిర్మాణానికి కూడా నోటీసులు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల ప్రక్షాళన పేరిట కాంగ్రెస్ సర్కారు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్లో చెరువుల రీ సర్వే పేరిట అల్లకల్లోలం చేసేందుకు అడుగులు వేస్తున్నది. ఇప్పటికే హైడ్రా,మూసీ ప్రక్షాళన పేరిట చేపట్టిన కూల్చివేతలే సామాన్యుడిని కలవర పెడుతుంటే.. చెరువుల రీ సర్వే అంటే కనుమరుగైన ఎన్నో చెరువుల పేరిట అగ్గిరాజేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఇన్నేండ్లు హెచ్ఎండీఏ నిర్దేశించిన చెరువుల బఫర్, ఎఫ్టీఎల్ ఆధారంగా అన్ని అనుమతులు, ఎన్వోసీలతో భవనాలు నిర్మించుకున్నా.. వాటితో సంబంధం లేకుండా బుల్డోజర్లను దింపనున్నది.
చెరువుల రీ సర్వే చేపట్టనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ‘పదేండ్లలో చెరువులన్నీ విధ్వంసానికి గురయ్యాయి. ఎంతో మంది చెరువు భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఇలానే వదిలేస్తే నగరంలో చెరువులు కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది. ఇప్పటివరకు ఆక్రమించుకున్న చెరువుల బఫర్ జోన్ ప్రాంతాలను వదిలేస్తాం. కానీ ఎఫ్టీఎల్ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకుంటాం. చెరువులు, కుంటల ఎఫ్టీఎల్ భూములను పరిరక్షించేలా సర్వే చేపడతాం. గతంలోనూ ఆక్రమణలు జరిగాయి. చెరువులు, కుంటల విషయంలో జరిగిన లోపాలను సవరించి ఎఫ్టీఎల్ వరకైనా జలవనరులను కాపాడుకుంటాం’ అని వెల్లడించారు.
చెరువుల హద్దులను శాస్త్రీయంగా గుర్తించేలా చర్యలు చేపట్టినట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. 45 ఏండ్ల డాటా ఆధారంగా చెరువుల ఎఫ్టీఎల్, పూర్తిస్థాయి వాటర్ స్ప్రెడ్ ఏరియాను గుర్తించేందుకు ఎన్ఆర్ఎస్ఏ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, ఇరిగేషన్ విభాగాల డాటాను ప్రామాణికంగా తీసుకుంటామని తెలిపారు. హైడ్రా కార్యాలయంలో సోమవారం లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఆయన.. విలేజ్ మ్యాప్స్, ల్యాండ్ యూజ్ సర్వే నంబర్లతో సహా సమాచారం ఇచ్చే క్యాడస్ట్రల్ మ్యాప్స్, 45 ఏండ్లలో పూర్తిస్థాయిలో చెరువు నీరు విస్తరించిన తీరుపై సమాచారాన్ని సేకరిస్తామని వివరించారు. హిమాయత్ సాగర్తో ఎఫ్టీఎల్, బఫర్జోన్ల గుర్తింపు ప్రారంభించి అదే విధానాన్ని అన్ని చెరువులకు వర్తింపజేస్తామని చెప్పారు. ఓఆర్ఆర్ పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయో, ఎంత మేర ఆక్రమణలకు గురయ్యాయో లెక్కలు తేల్చాలని అధికారులకు సూచించారు.
నగరంలో చెరువుల ఆక్రమణలను ఉపేక్షించేది లేదని రంగనాథ్ స్పష్టంచేశారు. చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ప్రజావసరాలకు నిర్దేశించిన స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా నిరంతరం నిఘా పెట్టేందుకు హైడ్రా చర్యలు చేపట్టిందని అన్నారు. ఆక్రమణలను వెంటనే గుర్తించేలా హైడ్రా ప్రత్యేక యాప్ను తీసుకొస్తున్నట్టు చెప్పారు. ఈ యాప్ ద్వారా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందని, తక్షణమే క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన, చర్యలు ఉంటాయని వివరించారు. ఆక్రమణలను తొలగించి చెరువుల్లో డెబ్రీస్ను పూర్తి స్థాయిలో తొలగిస్తామని చెప్పారు. మొదటిదశగా సున్నం చెరువు, అప్పా చెరువు, ఎర్రకుంట, కూకట్పల్లి నల్ల చెరువు పనులను ప్రారంభిస్తామని తెలిపారు.
ఏడు జిల్లాల హెచ్ఎండీఏ పరిధిలో 3,532కిపైగా చెరువులు ఉన్నాయి. చెరువు హద్దుల నిర్ధారణ, పర్యవేక్షణ, నిర్వహణ, పరిరక్షణ, ఆధునీకరణ కార్యకలాపాలను అదే చూసుకుంటుంది. ఇప్పటివరకు 2,525 చెరువులకు ప్రాథమిక హద్దులను ఖరారు చేసింది. ఇందులో 230 చెరువులకు మాత్రమే బఫర్ జోన్, ఎఫ్టీఎల్ నిర్ధారించింది. మిగిలిన వాటికి ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. ఈ క్రమంలో సమగ్రమైన వివరాలతో తుది నోటిఫికేషన్ జారీ చేయాల్సింది పోయి.. ఇప్పటివరకు చేసిన హద్దులను చెరిపివేసి, మొదటి నుంచి ప్రక్రియను మొదలుపెట్టనున్నది. ఈ లెక్కన పాత చెరువులకు కొత్తగా హద్దులను ఏర్పాటుచేసి పరివాహక ప్రాంత జనాలను కలవరపెట్టేలా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నది. రీ సర్వే పేరిట హద్దు రాళ్లను చెరిపేసి కొత్తగా హద్దులను నిర్ధారిస్తే పాత హద్దులు, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు ఇచ్చిన క్లియరెన్సులు బుట్టదాఖలు కానున్నాయి.
ఇప్పటికే హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట చేపట్టిన కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ రంగం ఢమాల్ అన్నది. ఇక దశాబ్దాల కాలంగా మూసీ వెంబడి ఉన్న నిర్మాణాలను కూలదోసేలా హద్దులను నిర్ధారిస్తుండగా, చెరువుల రీ సర్వే చేస్తే పేద, మధ్యతరగతి వర్గాలు కట్టుకున్న నిర్మాణాలన్నీ కూలిపోనున్నాయి. కుదేలైన రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం చెరువుల రీ సర్వే చేసి తులసి నీళ్లు పోసే కుట్రకు దిగిందని నిపుణులు పేర్కొంటున్నారు.