హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): అంటువ్యాధులు, ప్రాణాంతక వ్యాధుల వ్యాప్తిని పసిగట్టేందుకు మురుగు నీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సిద్ధమవుతున్నది. కరోనా సమయంలో హైదరాబాద్లోని ఎస్టీపీల వద్ద మురుగునీటిని సేకరించి కొవిడ్ విస్తరించిన ప్రాంతాలను గుర్తించినట్టే, దేశవ్యాప్తంగా పరిశోధనలు చేయనున్నది. హైదరాబాద్ కోసం రూపొందించిన ఈ విధానాన్ని ముంబై, జాల్నా, కోల్కతా, చెన్నైలో అమలు చేయనున్నది. దీని ద్వారా వ్యాధుల పుట్టుక, వ్యాప్తిని గుర్తించి నియంత్రణ చర్యలపై ప్రణాళికలు రూపొందించవచ్చని సీసీఎంబీ వర్గాలు భావిస్తున్నాయి. దానికోసం పీసీఆర్, ఆర్టీపీసీఆర్, క్యూఆర్టీపీసీఆర్ వంటి పరీక్షలను ఉపయోగిం చనున్నారు.