కొత్తగూడెం క్రైం, ఆగస్టు 8: తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు భద్రాద్రి జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ 141వ, 81వ బెటాలియన్ల అధికారుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు(Maoists Surrender). ఈ వివరాలను భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు గురువారం కొత్తగూడెంలో వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ శబరి ఏరియా కమిటీ సభ్యుడు వెట్టి లక్ష్మయ్య అలియాస్ కల్లు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మావోయిస్టు పార్టీ గొల్లపల్లి లోకల్ ఏరియా స్కాడ్ (ఎల్వోఎస్) సభ్యుడు మల్లం దేవా పోలీసుల ఎదుట లొంగిపోయారు. చర్ల మండలం కిష్టారంపాడు గ్రామానికి చెందిన లక్ష్మయ్య 2021లో చర్ల-శబరి ఏరియా కమిటీ మిలీషియా కమాండర్ వెట్టి దేవా అలియాస్ బాలు వద్ద మిలీషియా సభ్యుడిగా చేరాడు.
అతడి వద్దే ఉంటూ పార్టీకి నిత్యావసర సరుకులు, పార్టీ ఆదేశించిన పనులు చేస్తూ 2022 అక్టోబర్‌లో దళ సభ్యుడిగా పదోన్నతి పొందాడు. కొన్ని రోజులు భద్రాద్రి కొత్తగూడెం – అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ సభ్యుడు ఆజాద్‌కు గార్డుగా పనిచేశాడు. అనంతరం కొన్ని రోజులకు చర్ల ప్లాటూన్‌లో దళ సభ్యుడిగా పని చేసి.. 2023లో శబరి ఏరియా కమిటీకి బదిలీ అయ్యాడు. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా గొల్లపల్లి గ్రామానికి చెందిన మల్లం దేవా 2007 నుంచి 2015 వరకు మావోయిస్టు పార్టీకి చెందిన బాలల సంఘంలో పనిచేశాడు.
అదే సంవత్సరంలో గొల్లపల్లి ఎల్వోఎస్ కమాండర్ మడకం ఉంగల్ అలియాస్ ఎర్రాల్ వద్ద సభ్యుడిగా చేరి.. 2017లో మిలీషియా కమాండర్‌గా పదోన్నతి పొందాడు. 2020లో దళ సభ్యుడిగా పదోన్నతి పొంది ఇప్పటి వరకు గొల్లపల్లి దళ సభ్యుడిగా పనిచేశాడు. గొల్లపల్లి ఎల్వోఎస్ కమాండర్ ఎర్ర దాదా (డీవీసీ) మరణానం తరం అతడి స్థానంలో దేవా ఇన్చార్జిగా పనిచేశాడు. భద్రాద్రి పోలీసులు ఏర్పాటు చేసిన ‘ఆపరేషన్ చేయూత’లో పలు కుటుంబాల వారు అవగాహన పొందున్నారు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న తమ వారిని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే లక్ష్మయ్య, దేవాలు సత్ప్రవర్తన కలిగి జనజీవన స్రవంతిలో కలిసేందుకు వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోయారు.