హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాటం(Telangana armed struggle)చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గది. కానీ, నేడు ఈ చరిత్రకు సంబంధంలేని మతోన్మాద శక్తులు వాస్తవికతను వక్రీకరిస్తూ హిందు, ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తున్నారు. మత చాందసవాదులు కుట్రలను వక్రీకరణను తిప్పికొడుతూ తెలంగాణ సాయుధ పోరాటాన్ని వాస్తవికత చరిత్రను ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి తెలంగాణను లౌకిక ప్రజాస్వామ్యం వైపు నడిపించాలని సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి(Suravaram Sudhakar Reddy) పిలుపునిచ్చారు.
బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సీపీఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నాలుగు భాషలు ముద్రించి ప్రచురించిన బుక్లెట్ను ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాట సేనాని కామ్రేడ్ రావి నారాయణరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రజాపీడకులైన దొరలు, దేశముఖ్ లకు మధ్య జరిగిన తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ మతం రంగు అద్దుతున్నారు. తెలంగాణ సాయుధ పోరాట వాస్తవిక గాథ నేటి యువతరానికి తెలియాల్సి ఉంది. వేల ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయి. మహిళలపై అఘాయిత్యాలు జరిగేవి మాట వినకపోతే క్రూరమైన శిక్షలు విధించేవారు.
ఈ కష్టాల కడలి నుంచి బయటపడాలని ఆలోచిస్తున్న క్రమంలో ఆంధ్రమహాసభ ఉద్యమం ప్రారంభ మైందన్నారు. కమ్యూనిస్టు పార్టీ గ్రామాల్లో ప్రజలను సంఘటితం చేసి, భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని నిర్మించింది. రైతుల పంటలను భూస్వాములు లాక్కుంటున్న తరుణంలో ప్రజలు తిరగబడ్డారు. చేతికి దొరికిన ఆయుధంతో దొరల గూండాలను తరిమి కొట్టారు. అనంతరం 1947 సెప్టెంబర్ 11న కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిందని పేర్కొన్నారు. ప్రజలు బందూకులు చేతబట్టి దొరలను గడగడలాడించారు. ఇలాంటి మహత్తరమైన సాయుధ పోరాట చరిత్రను అభాసుపాలు చేసి వక్రీకరించడం ద్వారా రాజకీయ లబ్దిని పొందాలని బీజేపీ చూస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ మోసపూరితమైన కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి. సెప్టెంబర్ 11-17 మధ్య తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మరించుకుందామన్నారు.