హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని పార్టీలకు అతీతంగా అంగీకరిస్తే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి తెలంగాణ వైతాళికుడు, ఉద్యమకారుడు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడతామని, అందులో తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. సురవరం ప్రతాప్‌రెడ్డిపై తమ పార్టీ పెద్ద కేసీఆర్‌కు ఎనలేని గౌరవం ఉన్నదని, అందుకే తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం పేరు పెట్టాలని నిర్ణయించారని గుర్తుచేశారు. పదేండ్లపాటు యూనివర్సిటీ విభజన జరగలేదని, అందుకే పేరు పెట్టలేకపోయామని వివరించారు. పదేండ్లు గడిచి, విభజన జరిగినందున యూనివర్సిటీకి సురవరం పేరు పెట్టాలని సూచించారు. తెలంగాణ సంక్షిప్త పదాల మార్పు బిల్లును స్వాగతిస్తూనే ప్రభుత్వానికి బీజేపీ, ఎంఐఎం చురకలు అంటించాయి. ప్రభుత్వం పేర్లు మార్చటంపైనే కాకుండా ప్రజలకు పనికివచ్చే అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలని సూచించాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల పేర్లను మార్చిందని, ఆసరా పింఛన్లకు చేయూత, దళితబంధుకు అంబేద్కర్ అభయహస్తం అని పెట్టిందని ఉదహరించారు.
తాము కోరిన సమాచారాన్ని వెంటనే అందించి సహకరించేలా ఆయా ప్రభుత్వ విభాగాలకు ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. శుక్రవారం అసెంబ్లీలో సీఎంను కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు కమిషన్ కసరత్తు చేస్తున్నది. ఉదయం గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి కూడా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు.