ముషీరాబాద్, ఏప్రిల్ 3: దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్‌చేశారు. కుల వివక్ష ఉన్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని, క్రైస్తవులుగా మారినంత మాత్రాన కులం పోదని, అక్కడ కుల వివక్ష కొనసాగుతున్నదని అన్నారు. శుక్రవారం విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సీనియర్ నేత యాతాకుల భాస్కర్‌తో కలిసి మాట్లాడారు. దేశంలో కొన్ని కులాలకు పుట్టుకతోనే అంటరానితనం ఆపాదించబడుతుందని అవేదన వ్యక్తంచేశారు.
ఎస్సీలు క్రైస్తవులుగా మారినంత మాత్రాన కుల వ్యవస్థ పోదని, రెడ్డి ఫాస్టర్, కమ్మ, మాదిగ, మాల ఫాస్టర్ ఉంటారని, వారికి సమాజంలో ఒకే విలువ ఉండదని వాపోయారు. హిందూమతంలో ఎలాగైతే కుల వివక్ష ఉందో క్రిస్టియన్ మతంలో కూడా కుల వివక్ష ఉందని పేర్కొన్నారు. ఒక్కో కులానికి ఒక్కో చర్చి ఉంటుందని, దళిత క్రిస్టియన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పును మరోమారు సమీక్షించాలని కోరారు. ఈ తీర్సు మనువాదానికి అనుకూలంగా ఇచ్చిన తీర్పుగా తాము భావిస్తున్నట్టు చెప్పారు. రిజర్వేషన్లను తొలగించడం కోసం బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఈ దేశంలో బీజేపీ హిందూత్వం మాత్రమే ఉండాలని భావిస్తున్నదని విమర్శించారు. క్రిస్టియన్లకు అండగా నిలుస్తామని, రిజర్వేషన్లు కాపాడుకుంటామని స్పష్టంచేశారు.