హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతను కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన పిటిషన్లపై విచారణను అసెంబ్లీ స్పీకర్ త్వరితగతిన పూర్తిచేయాలని, లేనిపక్షంలో కోర్టు ధికరణగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ కేసును ఇకపై మళ్లీ వాయిదా వేయబోమని తేల్చి చెప్పింది. ఫిరాయిం పు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తీసుకొనే చర్యల ప్రగతిని మూడు వారాల్లో వివరించాలని స్పీకర్‌ను ఆదేశించింది. ఇదే చిట్టచివరి అవకాశమని తేల్చి చెప్పింది. ఇప్పటికే పలుసార్లు తగిన సమయం ఇచ్చామని గు ర్తుచేసింది. తదుపరి విచారణ నాటికి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై తీసుకున్న చర్యల నివేదికను దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. బీఆర్ఎస్ చిహ్నంపై గెలిచిన ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌లోకి ఫిరాయించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, వివేకానంద వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ ఏజీ మసీహతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది.
నిర్ణయం తీసుకోకుండా కాలయాపన
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా నిర్ణయం తీసుకునేందుకు మరికొంత గడువు కావాలని స్పీకర్ తరఫు న్యాయవాది కోరడంపై బీఆర్ఎస్ తరఫు న్యాయవాది మోహిత్‌రావు అభ్యంతరం వ్యక్తంచేశారు. గతంలో కూడా ఇదే మాదిరిగా వాయిదాలు కోరారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందాక అధికార కాంగ్రెస్‌లోకి ఫిరాయించడ మే కాకుండా ఒకరు కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ స్థానం నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయాక తాను ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పుకొంటున్నారని మోహిత్‌రావు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. మరొక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన కుమార్తెకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇప్పించుకుని బహిరంగంగా ఆ పార్టీకి ప్రచారం చేశారని, ఈ వ్యవహారంపై కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడాన్ని తీవ్రం గా పరిగణించాలని కోరారు. ఇలాంటి పరిస్థితుల్లో స్పీకర్ వాయిదా కోరితే అనుమతించవద్దని చెప్పారు.
ఎన్నికలు ఉన్నాయి.. గడువు ఇవ్వండి
తొలుత స్పీకర్ తరఫున సీనియర్ న్యా యవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేల పిటిషన్లపై స్పీకర్ తీర్పు చెప్పారని తెలిపారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయమై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో ము న్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని, నేతలంతా ప్రచార హడావుడిలో ఉన్నందున విచారణను మూడు వారాలకు వాయిదా వేయాలని కోరారు. దీనికి కేటీఆర్ తరఫు న్యాయవాది మోహిత్‌రావు అభ్యంతరం చెప్తూ.. స్పీకర్ పదేపదే వాయిదాలు కోరడాన్ని ఆమోదించవద్దని కోరారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరూ అధికార కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారని చెప్పా రు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా మీనమేషాలు లెకిస్తున్నారని ఆ రోపించారు. స్పీకర్ మళ్లీ గడువు కోరడాన్ని ఆమోదించవద్దని కోరారు. ఫిరాయింపుకు పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నప్పటికీ చర్యలు తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని అన్నారు.
కేసు విచారణపై రీల్స్ చేయొద్దు
ఈ వాదనలపై అభిషేక్ మనుసింఘ్వీ స్పందిస్తూ, ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద వచ్చిన పార్టీ ఫిరాయింపు అభియోగాలపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్ తరఫు న్యాయవాది మోహిత్‌రావు గట్టిగా అభ్యంతరం చెప్పిన తర్వాత ధర్మాసనం స్పందిస్తూ, స్పీకర్ సానుకూల నిర్ణయం తీసుకోవాలని తేల్చిచెప్పింది. ఈసారి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోనిపక్షంలో ఈ వ్యవహారాన్ని కోర్టు ధికరణ అంశంగా పరిగణిస్తామని హెచ్చరిక చేసింది. ఇదే సమయంలో పిటిషనర్ న్యాయవాది మోహిత్‌రావును ఉద్దేశించి.. ఈ విచారణ తీరుపై రీల్స్‌తో ప్రచారం కారాదని వ్యాఖ్యనించింది. మోహిత్‌రావు స్పందిస్తూ, గతంలోగానీ, ఇప్పుడుగానీ, భవిష్యత్లోగానీ కోర్టు విచారణ అంశాల ఆధారంగా తామెప్పుడూ రీల్స్ చేయలేదని, చేయబోమని వివరించారు. విచారణ మూడు వారాలకు వాయిదా పడింది.