MLAs Defections | హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన ఏడుగురు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీచేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, టీ ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి, ఎం సంజయ్‌కుమార్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్చంద్రన్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
అనంతరం ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని గతంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను, తాజాగా కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కలిపి విచారిస్తామని ధర్మాసనం పేర్కొన్నది. ఈ పిటిషన్లను తెలంగాణ స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీకి అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.