హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై దాఖలైన కీలక పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారించనున్నది. లక్షలాది బీసీ అభ్యర్థులు, ఓటర్ల భవిష్యత్తు సుప్రీంకోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉన్నది. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించనున్నారు. హైకోర్టులో ఇదే అంశంపై విచారణ పెండింగ్‌లో ఉన్నందున అక్కడ తేల్చుకొని రావాలని సుప్రీంకోర్టు చెప్తుందా? లేక ఇంకా ఏమైనా కీలక వ్యాఖ్యలు చేస్తుందా? అనే ఆసక్తి నెలకొన్నది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బట్టే హైకోర్టు నిర్ణయం ఉండవచ్చని కూడా న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున, సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్ణయాలను బట్టే తదుపది ప్రక్రియలు కొనసాగనున్నాయి. న్యాయస్థానాలు తీసుకోబోయే నిర్ణయాలను ముందుగానే అంచనా వేసిన ప్రభుత్వం అందుకు తగినట్టుగా మూడు ప్లాన్లు సిద్ధంచేసినట్టు తెలిసింది. వాటిని అమలుచేస్తామని అధికారవర్గాలకు చెప్తున్నది.
హైకోర్టులో మొదటి గండం
రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 26న జీవో నంబర్ 9 జారీ చేసి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించింది. దీనిని సామాజిక న్యాయంగా వర్ణించింది. ఈ జీవో ఆధారంగా రిజర్వేషన్ల గెజిట్లను పంచాయతీరాజ్‌శాఖ విడుదల చేసింది. ఆ మేరకు తెలంగాణలో స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు) ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు దఫాల్లో, పంచాయతీ ఎన్నికలు మూడు దఫాల్లో మొత్తం ఐదు దశల్లో అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తికానున్నది. అయితే, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాల్‌చేస్తూ మాధవరెడ్డి హైకోర్టు పిటిషన్ వేశారు. గత రిజర్వేషన్లు రద్దుచేయకుండా కొత్త రిజర్వేషన్లు కల్పిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం, విచారణను 8వ తేదీకి వాయిదా వేయింది. ఇదిలా ఉండగానే సుప్రీంకోర్టులో వంగా గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారించనున్నట్టు ప్రకటించింది.
సుప్రీంకోర్టులో రెండో గండం
వంగా గోపాల్‌రెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారించనున్నది. గోపాల్‌రెడ్డి ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని పిటిషన్లో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఇతర రిజర్వేషన్లు అన్నీ కలిపి కూడా 50 శాతం రిజర్వేషన్ దాటవద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్‌ను ఎత్తివేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఎస్సీలకు15 శాతం రిజర్వేషన్, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ 42 శాతంతో కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు 67 శాతం అవుతున్నదని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో 9ను తక్షణమే రద్దుచేయాలని కోరారు. ఈ పిటిషన్లో మాధవరెడ్డి, తీన్మార్ మల్లన్న ఇద్దరు కూడా ఇంప్లీడ్ అయ్యారు.
రిజర్వేషన్ గండం గెట్టేక్కేనా?
ఇప్పటికే హైకోర్టులో అదే అంశంపై పిటిషన్ విచారణలో ఉన్నందున హైకోర్టులో తేల్చుకోండని, అక్కడ తేలకపోతే ఇక్కడికి రావాలని సుప్రీంకోర్టు చెప్తుందా? లేదా ఇంకా ఏమైనా కీలక వ్యాఖ్యలు చేస్తుందా? అనే అంశంపై బీసీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇంద్రా సాహ్నీతోపాటు అనేక తీర్పుల ప్రకారం 50 శాతం మించి రిజర్వేషన్లకు అనుమతి లేదు.. కాబట్టి, రిజర్వేషన్ల పెంపునకు సానుకూల తీర్పు వచ్చే అవకాశం తకువగా ఉందని న్యాయనిపుణుల అంచనా వేస్తున్నారు. న్యాయంగా అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందేనని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో #BC42PercentJustice హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ అవుతున్నది. కోర్టులో జీవో నిలవదని కాంగ్రెస్ సర్కారుకు తెలుసని, తీర్పు బీసీ రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా వస్తే దీనికి కేంద్రాన్ని దోషిగా చిత్రీకరించి స్థానిక ఎన్నికల్లో లబ్ధిపొందాలని రెండు జాతీయ పార్టీలు పొలిటికల్ గేమ్‌గా ఆడుతున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ప్లాన్-ఏ,బీ, సీపై మల్లాగుల్లాలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ జీవోపై ఓ వైపు సుప్రీంకోర్టులో, మరోవైపు హైకోర్టులో విచారణలు కొనసాగుతున్న తరుణంలో స్థానిక ఎన్నికలపై ఎలా ముందుకు వెళ్లాలి? అని కాంగ్రెస్ సర్కారు మల్లగుల్లాలు పడుతున్నాది. ఇప్పటికే ఏ, బీ, సీ అనే ప్లాన్లు రెడీ చేసుకున్నట్టుగా అధికారవర్గాలు చెప్తున్నాయి. ప్లాన్-ఏ ప్రకారం.. ప్రతికూలంగా తీర్పు వస్తే హైకోర్టును మరింత గడువు కోరి పాత రిజర్వేషన్ల ప్రకారం వారం పది రోజులు ఆలస్యంగా ఎన్నికలు నిర్వహించాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మళ్లీ షెడ్యూల్ ఇచ్చి, రిజర్వేషన్లు మార్చి ముందుకెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్లాన్-బీ ప్రకారం.. ‘అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లులు ఆమోదించి రాష్ట్రపతి, గవర్నర్‌కు ఆమోదం కోసం బిల్లులు పంపించాం. వాళ్లు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆమోదం కోసం ఢిల్లీలో ధర్నా చేశాం.. కేంద్రంలోని బీజేపీ సర్కారు బీసీల వ్యతిరేకి.. అందుకే పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్ల ప్రకారం. బీసీలకు టికెట్లు ఇచ్చి ముందుకు వెళ్తాం..’ అని కాంగ్రెస్ పెద్దలు చెప్పాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ప్లాన్-సీ.. చివరి అవకాశంగా రాజ్యాంగ సవరణకు కేంద్రంతో చర్చలు జరిపి, 50 శాతానికి మించి రిజర్వేషన్‌కు మార్గం సుగమం చేయడం లక్ష్యంగా ముందుకు సాగాలని భావిస్తున్నట్టుగా సమాచారం. బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ నిర్ణయం తీసుకొనే వరకు వేచిచూద్దామని కూడా యోచిస్తున్నట్టు తెలిసింది.
ఢిల్లీకి పీసీసీ చీఫ్సహా మంత్రులు
ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించడానికి కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌తోపాటు బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సీనియర్ న్యాయవాదులను కలిసి న్యాయపరమైన అంశాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేలా ప్రభుత్వం పక్షాన బలమైన వాదనలు వినిపించాలని సూచనలు చేయనున్నారని తెలిసింది.