హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): బీసీలకు రిజర్వేషన్ల (BC Reservations) పెంపుపై హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం ఇప్పుడెలా ముందుకు వెళ్లాలనే తర్జనభర్జనలో పడింది. తదుపరి కార్యాచరణపై క్యాబినెట్లోనూ చర్చించినట్ట తెలిసింది. కేసును వాదించిన సీనియర్ న్యాయవాదులు, న్యాయనిపుణుల సలహాలు, సూచనల మేరకు తదుపరి కార్యాచరణ చేపట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. రెండు రోజుల్లో న్యాయనిపుణుల అభిప్రాయాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించినట్టు తెలిసింది.
స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతుండటం, బీసీల రిజర్వేషన్ పీటముడి వీడకపోవడం వంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ముందు మూడు ఆప్షన్లు కనిపిస్తున్నాయి.
మొదటిది: హైకోర్టు ఇచ్చే తుది తీర్పు వరకు ఎదురుచూడటం.
రెండోది: పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో (కాంగ్రెస్ టికెట్లలో బీసీలకు 42 శాతం కేటాయించి) ముందుకు వెళ్లడం.
మూడోది: పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లడం. అయితే, బీసీ సంఘాలు 42 శాతం రిజర్వేషన్ల కోసం గట్టిగా పట్టుబడుతున్నాయి.
హైకోర్టు తుదితీర్పు వచ్చేవరకైనా ఆగుతాంగానీ 42 శాతం రిజర్వేషన్లు తగ్గితే మాత్రం ఒప్పుకోబోమని స్పష్టం చేస్తున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా జేఏసీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ఇప్పటికే రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని స్పష్టంచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి గంపగుత్తగా బీసీ ఓట్లతో అధికార పీఠమెక్కిన కాంగ్రెస్.. వెన్నుపోటు పొడిస్తే ఊరుబోమని ఆయా సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
గతంలో రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపించింది. అయితే, ఒక బిల్లు రాష్ట్రపతి వద్ద, మరో బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. గత నెలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో 9 జారీచేసింది. అయితే, ఇది 50 శాతం పరిమితిని మించినట్టు హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు తాతాలిక స్టే ఇవ్వడంతో దానిని ఎత్తివేయాలని ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ, సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి నిరాశ కలిగించింది.
ఈ అంశంపై ప్రతిపక్షాలు కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నాయి. రాజ్యాంగం ప్రకారం.. పార్లమెంట్ ద్వారా చట్టం చేయకుండా జీవోలతో రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసి కూడా బీసీలను కాంగ్రెస్ మభ్యపెడుతున్నదని ఆరోపిస్తున్నాయి. చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు ఒక్కసారి కూడా బీసీ అంశాలను ఎందుకు లేవనెత్తలేదని ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, బీసీ సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల వివాదం మరింత ముదిరిపాకానపడనున్నది.