హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి చుకెదురైంది. మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వియాదవ్‌లకు సర్వోన్నత న్యాయస్థానం ఊరట కల్పించింది. బెయిల్‌పై ఉన్న ఆ ఇద్దరు మహిళా జర్నలిస్టులను మళ్లీ అరెస్టు చేసేందుకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా అవమానకర వ్యాఖ్యలు ఉన్న వీడియోను పోస్టు చేసి, ప్రచారం చేసిన కేసులో వారిద్దరిని తిరిగి అరెస్టు చేయరాదని జస్టిస్ సందీప్‌మెహతా, విక్రమ్‌నాథ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఆదేశించింది.
నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. రేవంత్‌రెడ్డిపై అవమానకర, అసభ్యకర వ్యాఖ్యలు ఉన్న వీడియోను యూట్యూబ్ చానల్లో పోస్టుచేసి ప్రచారం చేశారనే అభియోగాలపై పల్స్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ పీ రేవతి, న్యూస్ రిపోర్టర్ తన్వి యాదవ్‌ను ఈ ఏడాది మార్చి 12న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 17న జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు వీరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 200 రోజుల తర్వాత బెయిల్ క్యాన్సిల్ కాకపోయినా మరింత లోతుగా విచారించాల్సి ఉందని, వారిని మళ్లీ కస్టడీకి ఇవ్వాలని సెషన్స్ కోర్టును పోలీసులు ఆశ్రయించారు.
దర్యాప్తుకు సహకరిస్తున్నారని, మళ్లీ కస్టడీకి తీసుకోవడానికి ఎలాంటి కారణం లేదని పిటిషనర్ల తరఫున న్యాయవాది పేరొన్నారు. పిటిషనర్ ఆఫీస్ నుంచి వివిధ డివైసులు, ఆమె, భర్త పర్సనల్ డివైసులు పోలీసులు సీజ్ చేశారని వెల్లడించారు. పిటిషనర్ల కస్టడీ అవసరం లేదని తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు హైకోర్టులో సెప్టెంబర్ 30న క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. నిందితులను మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీంతో ఈనెల 13న మూడు రోజులపాటు కస్టడీకి తీసుకొని, విచారణ అనంతరం తిరిగి కోర్టులో హాజరుపర్చాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు వచ్చిన నాడే (13న) పిటిషనర్ల తరఫున ఆన్లైన్లో సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు.
జస్టిస్ సందీప్‌మెహతా, విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం.. గురువారం ఈ పిటిషన్‌ను విచారించింది. బెయిల్ క్యాన్సిల్ కాకముందే నిందితులను పోలీస్ కస్టడీలోకి తీసుకోవడం చట్టవిరుద్ధమని, బెయిల్ ఆపరేట్ అవుతుంటే, దర్యాప్తు కోసం పోలీసులు పిలిచి విచారించవచ్చుగానీ కస్టడీలోకి తీసుకోకూడదని న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదించారు. రాజకీయ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి సీనియర్ మహిళా జర్నలిస్టులను వేధిస్తున్నారని పేర్కొన్నారు. మహిళా జర్నలిస్టుల తరపున సిద్ధార్థ్ దవే వాదనలు విన్న తర్వాత మహిళా జర్నలిస్టులు ఇద్దరిని తిరిగి అరెస్టు చేయరాదని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.