హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూ భూముల అంశంపై సుప్రీంకోర్టు స్టే విధించడం.. రేవంత్‌రెడ్డి దుందుడుకు చర్యలకు చెంపపెట్టు అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. హెచ్‌సీయూ భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడాన్ని ఆహ్వానిస్తున్నట్టు ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో బుధవారమే సీఎం రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని గుర్తుచేశారు.
అధికారం ఉన్నదని ఏదిపడితే అది చేస్తామంటే చట్టం చూస్తూ ఊరుకోదని పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడటంలో ప్రభుత్వాలు విఫలమైనప్పుడు న్యాయస్థానం మార్గదర్శకంగా ఉండటం శుభపరిణామమని తెలిపారు. ఇది విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, సామాజికవేత్తల విజయం అని అభిప్రాయపడ్డారు. హెచ్‌సీయూ భూములను కాపాడుకునేందుకు ఎంతగానో పోరాడిన విద్యార్థులు, తెలంగాణ సమాజానికి హరీశ్‌రావు అభినందనలు తెలియజేశారు.