న్యూఢిల్లీ, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాల కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. ఎమ్మెల్సీల నియామకాల ప్రక్రియను కొనసాగిస్తే అవి తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉండాలని షరతు విధిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీళ్లను బుధవారంజస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలేతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. కోర్టు తుది ఆదేశాలు ఇచ్చే వరకూ హైకోర్టు ఆదేశాలపై యథాతథ స్థితి (స్టేటస్ కో) ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణ తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోరారు.
స్టేటస్ కో కాదని, స్టే ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు చెప్పగా అందుకు సిబల్ అభ్యంతరం వ్యక్తంచేశారు. స్టే ఇస్తే తిరిగి ఎమ్మెల్సీల నియామకాలు చేసే అవకాశం ఉన్నదని సుప్రీం ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. శాసనమండలి సభ్యులుగా దాసోజు, కుర్రను నియమించేందుకు గవర్నర్ నిరాకరించారని, రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా గవర్నర్ చర్యలు ఉన్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో స్టే ఇస్తే పిటిషనర్లను కాకుండా గవర్నర్ వేరే వారిని ఎమ్మెల్సీలుగా నియమించే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేసిన ఇద్దరు వ్యక్తుల నియామక గెజిట్‌ను కూడా తెలంగాణ హైకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. ఆ ఇద్దరినే నియమించేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయ త్నం చేస్తున్నదని సిబల్ అన్నారు.