హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా? అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కార పిటిషన్‌పై స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లో జవాబు చెప్పాలని స్పీకర్‌ను ఆదేశించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారం లోపలే నిర్ణయం తీసుకోవాలి, లేదంటే స్పీకర్ కాంటెంప్ట్‌కు సిద్ధం కావాలని స్పష్టం చేసింది. స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ లేదని ముందే చెప్పామని గుర్తుచేసింది. న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో ఆయనే నిర్ణయించుకోవాలని సీజేఐ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో, స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింగ్, ముకుల్ రోహత్గి నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని వెల్లడించారు. అనంతరం, రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. నాలుగు వారాల్లో జవాబు చెప్పాలని స్పీకర్‌ను ఆదేశించింది.