న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై సుప్రీం కోర్టులో (Supreme Court) రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం హైకోర్టుకు సూచించింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లవచ్చని చెప్పింది. 50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ఆదేశిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని కొట్టివేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలుపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. స్టేను ఎత్తి వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్పీ వేసింది. అయితే ప్రభుత్వ వాదనలు వినడాని కంటే ముందే తమ వాదనలను కూడా పరిగణనలోకి హైకోర్టులో పిటిషనర్ మాధవరెడ్డి ఇప్పటికే కెవియట్ పిటిషన్ వేశారు.