న్యూఢిల్లీ: సర్వీసులో కొనసాగే ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు శుక్రవారం పునరుద్ఘాటించింది. అలాగే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి గడువును 2028 ఆగస్టు 31 వరకు పొడిగించింది. అంజుమాన్ ఇషాత్-ఎ-తలీమ్ ట్రస్టు కేసులో ఇదివరకటి కోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ఉపాధ్యాయ సంఘాలు, వ్యక్తిగతంగా టీచర్లు దాఖలు చేసిన 65కిపైగా రివ్యూ పిటిషన్లను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. 2009 బాలల ఉచిత, నిర్బంధ విద్యా హక్కుచట్టం అమలులోకి రాకముందు నియమితులై పదవీ విరమణకు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం మిగిలి ఉన్న ఇన్-సర్వీసు టీచర్లు 2025 సెప్టెంబర్ 1 నుంచి రెండు సంవత్సరాల్లోపు టెట్‌లో ఉత్తీర్ణత సాధించాలని ఆదేశించిన 2025 కోర్టు తీర్పును పునఃపరిశీలించాలని పిటిషనర్లు కోరారు.
అధికారులు టెట్‌ను త్వరితగతిన నిర్వహించాలి. దీనికి అవసరమైన సమయం, వనరులు పరిమితంగా ఉన్న కారణంగా మేము కాలపరిమితిని 2 నుండి 3 సంవత్సరాలకు మార్చి పొడిగిస్తున్నాము. తొలుత ఉద్దేశించినట్లుగానే 2027 ఆగస్టు 31కి బదులుగా 2028 ఆగస్టు 31నాటికి అర్హతను పొందవలసి ఉంటుంది అని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొన్నది. అయితే మరోసారి సమయాన్ని పొడిగించే ప్రసక్త్తి లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. టెట్ నిబంధన అనేది చట్టాన్ని వర్తమానానికి వర్తింపచేయడమేనన్న వాదనను తోసిపుచ్చుతూ ఇన్-సర్వీసు ఉపాధ్యాయులు కూడా నిర్దేశిత కాలపరిమితిలోగా కనీస అర్హతలను పొందవలసి ఉంటుందని ఆర్టీఏ చట్టానికి చెందిన నిబంధనలు స్పష్టంగా నిర్దేశిస్తున్నాయని ధర్మాసనం పేర్కొన్నది.
ఆర్టీ చట్టం అమల్లోకి వచ్చిన నాటికి అప్పటికే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుందని, అలాగే నిర్దేశిత అర్హతలను పొందేందుకు వారికి సమయం ఇచ్చిందని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొన్నది. టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి చేసిన పర్యవసానంగా వేలాది మంది ఉపాధ్యాయలు ఉద్యోగాలు కోల్పోతారనే వాదన ఆధారంగా తీర్పును నిలిపివేయడం అంటే టెట్ అర్హత లేని ఉపాధ్యాయులు సర్వీసులో కొనసాగడమే అవుతుంది. అది రాబోయే తరాల విద్యా భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది అని కోర్టు పేర్కొన్నది.
న్యూఢిల్లీ, మే 29: ఆన్లైన్ బెట్టింగ్స్, ఆన్లైన్ గేమ్స్, జూదం ఆడటం ప్రాథమిక హక్కు కిందకు రావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్‌ను బ్యాన్ చేయడాన్ని జస్టిస్ పార్దీవాలా, ఆర్ మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం సమర్థించింది. ఆన్లైన్ గేమ్స్ అయిన రమ్మీ, పోకర్, ఫాంటసీ స్పోర్ట్స్ అనేవి వాణిజ్య రక్షణ పరిధిలోకి రావని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్న ఇలాంటి బెట్టింగ్స్‌ను ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని సుప్రీం సూచించింది.