‘కాళేశ్వరం కుప్పకూలింది.. ఎకరా కూడా సాగులోకి రాలేదు.. లక్ష కోట్లు వృథా ఇందులో పెద్ద స్కాం జరిగింది.. విచారణ కమిషన్ నిగ్గు తేలుస్తుంది’ అంటూ ఎన్నికలకు ముందు నుంచీ నిన్నటి దాకా చిల్లర కూతలు కూస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు, కమిషన్లు, విచారణ అంటూ హడావుడి చేస్తున్న రేవంత్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సాక్షిగా చెంపపెట్టులాంటి జవాబు లభించింది. ప్రాంత ప్రయోజనాలను, ప్రాజెక్టులను రాజకీయం చేస్తున్న దుర్నీతి ఎంత మాత్రం తగదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాజెక్టులు ప్రజా ప్రయోజనాల కోసం చేపడతారని, తెలంగాణలో అలా చేపట్టిన ప్రాజెక్టులతో ఎంతో అభివృద్ధి సాధ్యమైందని సుప్రీంకోర్టు ప్రశంసించింది.
ఏదో ఒక సాకు చూపుతూ ఇలా పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడుతాయి. అందులోభాగంగానే తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు. తెలంగాణలో ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కాళేశ్వరం నిర్మించారు. దీనివల్ల కొన్ని వేల ఎకరాల్లో సాగు జరుగుతున్నది. తెలంగాణ వరి ధాన్యం సాగు లో ఎంతో పురోభివృద్ధి సాధించింది.
– జస్టిస్ సతీశ్ చంద్రశర్మ
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందనేందుకు ఎలాంటి ఆధారాల్లేవు. అలాంటి పిటిషన్లను విచారించే అవసరం కూడా లేదు. ఇందులో హైకోర్టు అన్ని విషయాలను పరిశీలించే తీర్పు ఇచ్చింది. మళ్లీ అందులో జోక్యం చేసుకునే అవసరం లేదు. ఈ అంశంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదిక కూడా చాలా విషయాలపై స్పష్టతనిచ్చింది.
– జస్టిస్ నాగరత్న
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి నిర్మించిన రెండు భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కొన్నాళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి.. కమిషన్ల పేరిట హడావుడి చేస్తున్న వారికి దేశ సర్వోన్నత న్యాయస్థానం దిమ్మతిరిగేలా జవాబిచ్చింది. విస్తృత ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వాలు ప్రాజెక్టులను చేపడుతాయని, వాటిపై అర్థంపర్థం లేని ఆరోపణలు సరికాదంటూ పరోక్షంగా మొట్టికాయలు వేసింది. తెలంగాణ సాగు చిత్రాన్ని ఎలా మార్చిందో వివరిస్తూ కాళేశ్వరానికి కితాబిచ్చింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ద్విసభ్య ధర్మాసనం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కాళేశ్వరం వంటి ప్రాజెక్టు నిర్మించారని, అది ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమని గుర్తుచేశారు. ఆ ప్రాజెక్టు ఫలితంగా వేలాది ఎకరాల్లో వరిసాగు జరుగుతున్నదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ‘ఏదో ఒక సాకు చూపుతూ ఉద్దేశ పూర్వకంగా పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు. విస్తృత ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడుతాయి. అందులో భాగంగానే తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు. దీనివల్ల వేల ఎకరాల్లో సాగు జరుగుతున్నది. తెలంగాణ వరిధాన్యం సాగులో ఎంతో పురోభివృద్ధిని సాధించింది’ అని జస్టిస్ శర్మ పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మరో భారీ నీటిపారుదల పథకం.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అవినీతి జరిగినట్టు ఎక్కడా ఆధారాల్లేవంటూ రాష్ట్ర హైకోర్టు గతంలో వెలువరించిన తీర్పును పునరుద్ఘాటించింది. ప్రజాప్రయోజనాల వ్యాజ్యాల పేరిట అర్థరహిత ఆరోపణలతో దాఖలయ్యే పిటిషన్లను విచారించలేమని స్పష్టంచేసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలు జరిగాయని, సీబీఐతో దర్యాప్తు చేయించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ అనంతరం హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఐదేండ్లుగా విచారణ కొనసాగుతున్నది. బుధవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం హైకోర్టు తీర్పుపై జోక్యానికి నిరాకరించింది. నాగం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది.
అంతకుముందు ధర్మాసనం ఎదుట పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ వాదనలు వినిపించారు. ప్రాజెక్టుపై పిటిషన్‌దారు చేస్తున్న ఆరోపణలను వివరించే ప్రయత్నం చేశారు. ప్రాజెక్టు పనులను నిర్వహించిన మేఘా కంపెనీ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. ఇప్పటికే పాలమూరు-రంగారెడ్డిపై దాఖలైన నాలుగు పిటిషన్లను తెలంగాణ హైకోర్టు విచారించిందని, సుదీర్ఘ వాదనల తర్వాత అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి న్యాయస్థానం వాటిని కొట్టివేసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఎటువంటి అవకతవకలు జరగలేదని సీఈసీ నివేదికలోనూ తేలిందని గుర్తుచేశారు. ఒకటీ రెండు పత్రాలను చూపుతూ ఉద్దేశపూర్వకంగానే పిటిషన్లు దాఖలు చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా.. పిటిషనర్ ఆరోపిస్తున్నట్టు బీహెచ్ఈఎల్ వంటి కీలక భాగస్వామి ఎటువంటి ఫిర్యాదు చేయలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ద్విసభ్య ధర్మాసనం నాగం జనార్దన్‌రెడ్డి పిటిషన్ ను కొట్టివేస్తున్నట్టు తీర్పునిచ్చింది. ‘పాలమూరు-రంగారెడ్డిపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదు. సుదీర్ఘ విచారణ తర్వాతే నాలుగు పిటిషన్లపై హైకోర్టు తీర్పును వెలువరించింది. ప్రాజెక్టు పనుల్లో అవినీతి జరిగినట్టు అందులో ఎక్కడా చెప్పలేదు. హైకోర్టు తీర్పుతో ఏకీభవిస్తున్నం. అందులో జోక్యం చేసుకోవడానికి ఏమీలేదు. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేం’ అని జస్టిస్ నాగరత్న స్పష్టంచేశారు. ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ప్రజాప్రయోజన వ్యాజ్యాల పేరిట ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదులు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా వేలాది ఎకరాల్లో వరిసాగు జరుగుతున్నదని, సాగులో రాష్ట్రం ఎంతో పురోభివృద్ధిని సాధించిన విషయాన్ని గుర్తించాలని వ్యాఖ్యానించారు.