హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): గ్రూప్1 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఉత్తర్వుల జారీకి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్‌పై జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అయితే గ్రూప్-1 ఫలితాలు వెలువడకముందే తమ వద్దనున్న పిటిషన్లపై విచారణను పూర్తి చేసి తగిన తీర్పును వెలువరించాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్1 పరీక్షను వాయిదా/రీషెడ్యూల్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. తొలుత ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఇప్పటికే అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్లో ఉన్నప్పుడు స్టే ఎలా ఇస్తాం. ఇది గందరగోళానికి 2వ పేజీలోదారితీస్తుంది’ అని వ్యాఖ్యానించింది. దీనిపై పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కపిల్‌సిబల్ స్పందిస్తూ.. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో29 తీసుకువచ్చిందని చెప్పారు. దాదాపు 14 ఏండ్ల తర్వాత తొలిసారి గ్రూప్-1 పరీక్ష జరుగుతున్నదని వివరించారు. మరోసారి వీటిని భర్తీ చేయడం జరగదని అన్నారు. ఈ సారి అవకాశం కోల్పోతే, జీవితంలో తుది చాన్స్ ఉండదని చెప్పారు. అందువల్ల జీవో 29పై స్పష్టత వచ్చే వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతున్నట్టు నివేదించారు. మధ్యలో సీజేఐ జోక్యం చేసుకొంటూ.. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏ విధంగా పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించగలమని ప్రశ్నించారు. ఇది అసాధారమైన విషయం అని గుర్తుచేశారు. ఇందుకు సిబల్ బదులిస్తూ.. వేలాది మంది అభ్యర్థులకు సంబంధించిన అంశమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్సెస్ బిపేంద్రయాదవ్ కేసులోని తీర్పు వివరాలను బెంచ్ ముందుంచారు. నష్టపోతున్న అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నామని అన్నారు. మరోసారి సీజేఐ బెంచ్ స్పందిస్తూ.. తమ తుది తీర్పుకు లోబడే నియామకాలు జరపాల్సి ఉంటుందని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో వెల్లడించిన విషయాన్ని గుర్తుచేసింది.
గత నెల 31న ఈ కేసు రాష్ట్ర హైకోర్టు ముందు విచారణకు వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ అడ్వకేట్ నిరంజన్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. టీజీపీఎస్సీ ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు ముందు కౌంటర్ ఫైల్ చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలను కౌంటర్ రూపంలో అందజేయనుందని వివరించారు. తమ తుది తీర్పుకు లోబడే.. నియామకాలు జరపాల్సి ఉంటుందని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేరొందని గుర్తుచేశారు. నవంబర్ 20న హైకోర్టులో తదుపరి విచారణ జరుగనుందని చెప్పారు. సీజేఐ జోక్యం చేసుకుంటూ ఫలితాల విడుదలకు ముందే ఈ కేసులో తుది విచారణ ముంగించాలని హైకోర్టుకు సూచించినట్టు వెల్లడించారు. పిటిషన్‌ను తిరసరిస్తున్నట్టు స్పష్టం చేశారు.
గ్రూప్-1 విషయంలో రేవంత్ సర్కారు మూర్ఖత్వంతో వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ నేత, న్యాయవాది దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. సుప్రీంకోర్టులో విచారణ అనంతరం ఢిల్లీలో శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. గ్రూప్-1 అభ్యర్థుల తరపున న్యాయపోరాటం చేసేందుకు తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామని తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్21 (నమస్తే తెలంగాణ): జీవో 29తో బీసీలకు తీవ్ర అన్యాయం వాటిల్లుతున్నదని, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతూ బీసీ మేధావుల ఫోరం సోమవారం గవర్నర్ జిష్ణుదేవ్ వ ర్మను రాజ్‌భవన్‌లో కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, పల్లె రవికుమార్, జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, కుందారం గణేశ్‌చారి, చెరుకు సుధాకర్, బాలగోని బాలరాజు, బత్తిని సిద్ధేశ్వర్, సంగం సూర్యారావు, చామకూర రాజు, బత్తిని లత, బంగారు నర్సింహసాగర్, కేవీ గౌడ్, ఎర్రమాద వెంకన్న, ఒం టెద్దు నరేందర్ మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్, జీవో 29 ద్వారా గ్రూప్-1 రిక్రూట్మెంట్లో మొత్తం అగ్రవర్ణాలే ఎంపికయ్యే ప్రమాదముందని హెచ్చరించారు.
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై వారం రోజులపాటు ఉద్రిక్తలు కొనసాగగా.. సోమవారం పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 46 సెంటర్లలో జరిగిన జనరల్ ఇంగ్లిష్ పరీక్షకు 22,744(72.4 శాతం) మంది హాజరైనట్టు అధికారులు ప్రకటించారు. మొత్తం 31,383 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 8,639 మంది పరీక్షకు గైర్హాజరైనట్టు వెల్లడించారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించలేదు.