Supreme Court | తెలంగాణ అసెంబ్లీలో ఎవరు పార్టీ మారినా ఉప ఎన్నికలు రావు అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి మారినా ఉప ఎన్నికలు రావంటూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సుందరం సీఎం ప్రకటనను బెంచ్‌కు చదివి వినిపించారు.
‘గౌరవనీయులైన స్పీకర్ సర్ తమరి ద్వారా నేను ఒకటి చెప్పదలుచుకున్న. ఎవరైతే సభ్యులున్నరో వాళ్లు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఏ ఉపఎన్నికలూ రావు. వారు కోరుకున్నా ఉపఎన్నికలు రావు. అటోళ్లు ఇటొచ్చినా, ఇటోళ్లు అటుపోయినా ఉపఎన్నికలు రావు’ అంటూ వ్యాఖ్యానించిన విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై జస్టిస్ గవాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో ఇలా చెప్పి.. సీఎం పదో షెడ్యూల్‌ను అపహాస్యం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. తాను సీఎం తరఫున హాజరుకాకపోవడంతో ఆ ప్రకటన గురించి వివరించలేకపోతున్నారని తెలిపారు. గతంలోనూ మరో కేసులో సీఎంని మందలించిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. 2024 ఆగస్టులో 2015 నాటికి ఓటుకు నోటు కేసు విచారణను బదిలీ చేయాలన్న పిటిషన్‌ను విచారణ సమయంలో జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే కవితకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.
చట్టసభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ని సీఎం స్థాయి హోదాలో ఉన్న అపహాస్యం చేయడం కిందకే వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కాకుండా సీఎంను హెచ్చరించాలని న్యాయవాది ముకుల్ రోహత్గికి సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తరహా వ్యాఖ్యలు ఉపేక్షించబోమని, అవసరమైతే కోర్టు ధిక్కారంగా భావించాల్సి వస్తుందని హెచ్చరించింది. తాము అన్ని ఆలోచించే కోర్టు ధిక్కార నోటీసులు ఇస్తున్నామని, అంతమాత్రాన మాకు అధికారాలు లేవని కాదని.. అసెంబ్లీలో రాజకీయ నేతలు చేసే ప్రకటనలకు పవిత్రత ఉంటుందని.. అసెంబ్లీలో మాట్లాడే అంశాలను సైతం కోర్టులో పరిగణలోకి తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది.