న్యూఢిల్లీ, డిసెంబర్ 3: యూపీఎస్సీ పరీక్షల్లో వికలాంగుల అభ్యర్థుల కోసం తీసుకొచ్చిన ‘స్ర్కైబ్’ ఆప్షన్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. పరీక్షకు కనీసం ఏడు రోజుల ముందు తమ ‘స్ర్కైబ్’ను మార్చుకునే అవకాశం వికలాంగ అభ్యర్థులకు కల్పించాలని, ఇందుకు అనుమతించే నిబంధనను నోటిఫికేషన్లో చేర్చాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)ని బుధవారం ఆదేశించింది.
అలాగే దృష్టిలోపమున్న అభ్యర్థుల కోసం ‘స్క్రీన్ రీడర్ సాఫ్ట్వేర్’పై సమగ్రమైన వివరాలను కోర్టుకు సమర్పించాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నది. వికలాంగులైన అభ్యర్థులు యూపీఎస్సీ పరీక్ష రాసేందుకు సహాయపడే వ్యక్తిని ‘స్ర్కైబ్’ అంటారు. దృష్టిలోపం, శారీరక వైకల్యం ఉన్నవారు సమాధానాలు చెబుతుంటే, స్ర్కైబ్ రాస్తారు. తమ స్ర్కైబ్ను మార్చుకునే అవకాశం కూడా ఉంది.