హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి బెయిల్‌ను రద్దుచేయాలని ఎంపీ రఘు రామకృష్ణ రాజు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. జగన్, సీబీఐ సహా ప్రతివాదులందరికీ జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్‌ను సీబీఐ, ఈడీ కనీసం సవాల్ చేయలేదని ఎంపీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పదేండ్లుగా జగన్ బెయిల్‌పై ఉన్నారని, అధికారంలోకి వచ్చాక సాక్ష్యాలు చెరిపేస్తున్నారని, కేసు తీవ్రత దృష్ట్యా వెంటనే బెయిల్ రద్దు చేయాలని కోరారు. అయితే, సాక్ష్యాలు చెరిపేస్తున్నారనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అని ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణను జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.