(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వోద్యోగం చేసి ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్ల హక్కులను కాపాడే దిశగా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యం (డీఏ), పెన్షనర్లకు ఇచ్చే కరువు ఉపశమనం(డీఆర్)లో వివక్షను తప్పుబట్టింది. ఇది సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనని తేల్చి చెప్పింది. ధరాఘాతం అందరి మీద ఒకే విధంగా ఉన్నప్పుడు.. డీఏ, డీఆర్ పెంపులో తేడా ఎందుకని ప్రశ్నించింది. ఈ మేరకు ఓ కేసులో శుక్రవారం జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ప్రసన్న బీ వరాలేతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది.
ఏమిటీ కేసు?
కేఎస్ఆర్టీసీ ఉద్యోగులకు 14 శాతం డీఏను పెంచుతూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. అయితే, పెన్షనర్లకు మాత్రం 11 శాతం మేర మాత్రమే డీఆర్‌ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ధరాఘాతం అందరిమీద ఒకే విధంగా ఉన్నప్పుడు పెంపులో తేడా ఎందుకంటూ పెన్షనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సంస్థ ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగానే ఉద్యోగుల కంటే పెన్షనర్లకు పెంపును తగ్గించినట్టు వాదనల సందర్భంగా కేరళ ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది.
సుప్రీం కీలక వ్యాఖ్యలు
ప్రభావం నుంచి ఉపశమనం పొందేందుకు ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చేదే డీఏ, డీఆర్. ధరల పెరుగుదల అందరిపై ఒకేలా ఉంటుంది. ఉద్యోగులపై అది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో, పెన్షనర్ల మీద కూడా అలాంటి ప్రభావాన్నే చూపిస్తుంది. అలాంటప్పుడు డీఏ, డీఆర్ పెంపులో తేడాలు ఎందుకు?
తేడా ఉన్నట్టయితే అది వివక్షతో కూడిన ఏక పక్ష నిర్ణయంగానే పరిగణించాలి. ఇలాంటి నిర్ణయాలు సమానత్వ హక్కులను హరిస్తాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఇది ఉల్లంఘించడమే అవుతుంది.
సంస్థ ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్టయితే, అప్పుడు డీఏ, డీఆర్‌ను ఏ మేరకు పెంచాలి? అనేది ముందుగా నిర్ణయించాలి. ఆ తర్వాత ఆ పెంపును ఇరు వర్గాలకు (ఉద్యోగులు, పెన్షనర్లకు) సమానంగా ఇవ్వాలి. అంతేగానీ, ఒకరికి ఎక్కువ పెంచి, మరొకరికి తక్కువ ఇవ్వడం న్యాయమైన చర్య అనిపించుకోదని పేర్కొన్న ధర్మాసనం.. డీఏ, డీఆర్‌ను సమానంగా పెంచాలని కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.