హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ రిటైర్డ్ చీఫ్ టీ ప్రభాకర్‌రావుకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మార్చి 10 వరకు పొడిగించింది. కస్టడీ విచారణ పూర్తయినప్పటికీ, ఆయనను జైలులో ఉంచాలనే తెలంగాణ ప్రభుత్వ వ్యవహారశైలిని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ వ్యవహారంపై న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. కస్టడీ విచారణ పూర్తయి రెండు వారాలైన తర్వాత కూడా ప్రభాకర్‌రావును జైలులో లేదా కస్టడీలో ఉంచాలనే ప్రభుత్వ వైఖరిని ఎండగట్టింది. రావుకు గతంలో మంజూరుచేసిన మధ్యంతర బెయిల్‌ను శాశ్వత బెయిల్‌గా మార్చేందుకు మొగ్గుచూపింది. ‘రావు కుంగిపోయే వరకు మీరు ఆయనను జైలులో ఉంచాలనుకుంటున్నారని మాకు అనిపిస్తున్నది.
మా ఉత్తర్వుల పరిధికి మించి వినియోగించాలని ప్రయత్నం చేస్తే మేముము చూస్తూ ఉండబోము’ అని హెచ్చరించింది. ఫోన్‌ట్యాపింగ్ వివరాలను రాబట్టడానికి, ఎవరి ఆదేశాల మేరకు అది జరిగిందో తెలుసుకోవడానికి దర్యాప్తు బృందం ప్రభాకర్‌రావును మరింతగా విచారించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను పరిషరించి కేసు విచారణను ముగించడానికి అధిక ఆసక్తి చూపింది. అయితే, పిటిషన్‌ను ముగించే ముందు కొన్ని అంశాలను నిర్ణయించాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది పదేపదే నొకి చెప్పడంతో విచారణను వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ, మూడు ముఖ్యమైన చట్టపరమైన ప్రశ్నలను నిర్ణయించాలని కోర్టును కోరారు. పరారీలో ఉన్నట్టు పేర్కొన్న వ్యక్తి, విదేశాలలో నివసిస్తున్న వ్యక్తి ముందస్తు బెయిల్ దరఖాస్తును దాఖలు చేయలేరని చెప్పారు.
ఇప్పటికే ఒకసారి కస్టడీలో ఉన్న వ్యక్తికి ముందస్తు బెయిల్ పిటిషన్ ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నించారు. అయితే కస్టడీ విచారణ పూర్తయిందని ధర్మాసనం పునరుద్ఘాటించింది. గత డిసెంబర్ 11న జారీచేసిన ఆదేశాల ప్రకారం రావు లొంగిపోయారని, కస్టడీ కేవలం దర్యాప్తునకు దోహదపడేలా ఉత్తర్వులు ఇచ్చామని గుర్తుచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఈ ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ నిందితుడికి పూర్తి మినహాయింపు ఇవ్వదని, అవసరమైతే తదుపరి విచారణ కోసం రావును పిలిచేందుకు పోలీసులకు ఇంకా స్వేచ్ఛ ఉందని చెప్పింది. కోర్టు చట్టపరమైన సూత్రాలపై కఠినంగా వ్యవహరిస్తుందని జస్టిస్ నాగరత్న స్పష్టంచేశారు. రావుకు మధ్యంతర రక్షణను మార్చి 10 వరకు ధర్మాసనం పొడిగించింది. ఈ మధ్యకాలంలో ప్రభాకర్‌రావుపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది.