హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ఫోన్‌ట్యాపింగ్ కేసులో నిందితుల విచారణ సమయంలో రాజకీయ నాయకులు హాజరుకావడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కొందరు ఎంపీ, ఎమ్మెల్యేల, రాజకీయ నేతల సమక్షంలో పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు దర్యాప్తు జరిపారంటూ న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం విస్తుపోయింది. ‘పోలీసుల విచారణ అంటే తమాషానా?’ అంటూ తీవ్రంగా మండిపడింది. రాజకీయ నేతల సమక్షంలో నిందితులను పోలీసులు ఎలా విచారిస్తారని ప్రశ్నించింది. పోలీసుల దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. కేసు దర్యాప్తుపై రాజకీయ ప్రభావం లేకుండా ఉండాల్సిందేనని నొక్కి చెప్పింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాల్సిందేనని, దర్యాప్తులో రాజకీయ నేతలను అనుమతించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.
కొంతమంది రాజకీయ నాయకులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యవహరించారని పిటిషనర్ రిటైర్డు ఐపీఎస్ అధికారి టీ ప్రభాకర్‌రావు తరఫు సీనియర్ న్యాయవాది డీఎస్ నాయుడు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడంతో ధర్మాసనం పైవిధంగా స్పందించింది. విచారణ సమయంలో రాజకీయ నాయకుల హాజరు అనుచితమని వ్యాఖ్యానించింది. ఫోన్‌ట్యాపింగ్ కేసులో నిందితుడు, తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టీ ప్రభాకర్‌రావును అరెస్టు చేయరాదని గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలను వెలువరించింది. ప్రభాకర్‌రావుకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కలిపి విచారించింది.
రాజకీయ నాయకుల సమక్షంలో విచారణ
తొలుత తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ప్రభాకర్‌రావు ఆదేశాలతో ఫోన్‌ట్యాపింగ్ జరిగిందని, కీలకమైన ఎలక్ట్రానిక్ ఆధారాలను ధ్వంసం చేశారని, దర్యాప్తునకు ఆయన సహకరించడం లేదని కోర్టుకు తెలిపారు. దీనిపై ప్రభాకర్‌రావు తరఫు సీనియర్ న్యాయవాది డీఎస్ నాయుడు స్పందిస్తూ.. ప్రభుత్వ వాదనను తీవ్రంగా ఖండించారు. పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తున్నారని, వ్యక్తిగత ఐక్లౌడ్ ఖాతాను ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో రీసెట్ చేయడానికి అంగీకరించారని తెలిపారు. విచారణ జరిపినప్పుడు పోలీసులు వీడియో చిత్రీకరణ చేశారని, విచారణకు పిటిషనర్ సహకరించిందీ లేనిదీ వీడియోల్లో రికార్డయి ఉంటుందని కోర్టుకు వెల్లడించారు. నిపుణులు ఎవరైనా పిటిషనర్ ఐక్లౌడ్ లాగిన్లను ధ్రువీకరించవచ్చునని చెప్పారు. కేసు దర్యాప్తు సమయంలో రాజకీయ నేతలను, ఎంపీలు, ఎమ్మెల్యేలను పోలీసులు తీసుకువచ్చారని.. వారి సమక్షంలోనే నిందితులను విచారించారని చెప్పడంతో జస్టిస్ నాగరత్న తీవ్రంగా స్పందించారు. ‘ఇది తమాషా కాదు! ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చి విచారణ జరిగే చోట ఎలా ఉంటారు?’ అని పోలీసులను ప్రశ్నించారు. కేసు దర్యాప్తు సమయంలో ఉండటానికి వీల్లేదని స్పష్టంచేశారు. ఐక్లౌడ్ పాస్‌వర్డ్‌ను ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో రీసెట్ చేసి, యాక్టివేట్ చేసుకోవచ్చునని తెలిపారు.
‘పోలీసుల చర్య వెనుక ఎవరున్నారు?’
‘కేసు దర్యాప్తు అనేది న్యాయ ప్రక్రియ. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైనది. దర్యాప్తు సమయంలో రాజకీయ నాయకులు హాజరుకావడం సమర్ధనీయం కాదు. ఇదేమీ రాజకీయ కేసు విచారణ కాదు. నేతల సమక్షంలో దర్యాప్తు సాగించడం అంటే.. ఆ విచారణను నేతలు ప్రభావితం చేయడమే అవుతుంది. ఇది తమాషా కాదు. కారాదు! పోలీసులు తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వర్తించాల్సిందే. రాజకీయ ప్రభావానికి లోనుకాకూడదు. దర్యాప్తు సమయంలో రాజకీయ నాయకులు ఎందుకు పోలీస్‌స్టేషన్‌లో ఉన్నారు? ఎవరి ఆదేశంతో ఇది జరిగింది?’ అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. పోలీసుల దర్యాప్తు నిష్పక్షపాతంగా, పాదర్శకంగా, న్యాయబద్ధంగా చేయకపోతే ఆ ప్రక్రియను అపహాస్యమైందనే అపనమ్మకం ప్రజల్లో ఏర్పడే ప్రమాదముందని వ్యాఖ్యానించింది. దర్యాప్తు న్యాయబద్ధంగా జరగాలేకానీ, రాజకీయ రంగస్థలంగా మారకూడదని పేర్కొన్నది. కేసు తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. అప్పటి వరకు గతంలోని మధ్యంతర ఉత్తర్వులను అమల్లో ఉంటాయని స్పష్టంచేసింది.