కత్తి పరాయోడిదే కానీ..
పొడిచేది మనోడే!.. ఉద్యమ సమయంలో కేసీఆర్ కొన్ని వందలసార్లు చెప్పిన మాట ఇది. అటు కాళేశ్వరం విషయంలోకానీ, ఇటు బనకచర్ల విషయంలో కానీ రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇలాగే ఉన్నది. మన జలహక్కులను గాలికొదిలి.. పొరుగు రాష్ట్రం ప్రాజెక్టుల కోసం వెంపర్లాడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మన నదీజలాలకు గండికొట్టేలా ఏపీ కడుతున్న ప్రాజెక్టులకు పరోక్షంగా మద్దతు పలుకుతున్నది.
గోదావరి-బనకచర్ల లింక్‌పై మొదటినుంచీ రేవంత్ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు కనిపించింది. చర్చల పేరుతో ఎక్కడలేని ఉత్సాహాన్ని ప్రదర్శించింది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్తోపాటు, తెలంగాణవాదులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేయడంతో తప్పని పరిస్థితుల్లో.. మొక్కుబడిగా న్యాయపోరాటానికి దిగింది. ఎక్కడా చిత్తశుద్ధి లేదు! సుప్రీంకోర్టులో అత్యంత లోపభూయిష్టంగా పిటిషన్ వేసింది. సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్‌ను తిరస్కరించిందంటే ఎంతటి బలహీన వ్యాజ్యం వేసినట్టు?
రోగి కోరుకున్నదే డాక్టర్ రాసినట్టు.. రేవంత్ సర్కార్ అనుకున్నట్టే చేసింది!బాబు ప్రభుత్వం ఆశించినట్టే జరిగింది! తెరవెనుక రాజీతంత్రంతో తెలంగాణ మళ్లీ మోసపోయింది!
హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): అనుకున్నదే జరిగింది. బనకచర్లకు రేవంత్ సర్కార్ సహకరిస్తున్నదనే విషయం మరోసారి సుస్పష్టమైంది. అనేక లోపాలతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని అత్యున్నత ధర్మాసనమే తేల్చిచెప్పింది. బనకచర్ల ప్రాజెక్టుపై విచారణకు తిరస్కరించింది. లోపాలను సవరిస్తేనే విచారిస్తామని తేల్చిచెప్పింది. మొదటి నుంచీ ఏపీ ప్రతిపాదనలకు సై అంటున్న రేవంత్ ప్రభుత్వం, సుప్రీంకోర్టులో సైతం ఉద్దేశపూర్వకంగానే లోపాలతో కూడిన పిటిషన్ దాఖలు చేసిందనేది తేలిపోయింది. సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ నీటిరంగ నిపుణులు సైతం ఇదే విషయమై నిప్పులు చెరుగుతున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నిబంధనలకు, ట్రిబ్యునల్ అవార్డులకు విరుద్ధంగా, తెలంగాణ జలహక్కులకు విఘాతం కలిగించేలా గోదావరి జలాలను మళ్లించేందుకు పోలవరం- బనకచర్ల ప్రాజెక్టును చేపడుతున్న విషయం తెలిసిందే. ఏపీ చేపట్టిన ఈ ప్రాజెక్టును మొక్కుబడిగా వ్యతిరేకిస్తూ తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పోలవరం ప్రాజెక్టు, గోదావరి నీటి వినియోగం, బనకచర్ల అనుసంధాన అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సూట్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారించింది.
విచారణ ప్రారంభం కాగానే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సమర్పించిన ఆఫీస్ రిపోర్ట్‌ను ధర్మాసనం ప్రస్తావించింది. పిటిషన్లో లోపాలున్నాయని, ప్రతివాదులకు నోటీసులు అందజేసే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, కేసును విచారించలేమని, ఆఫీస్ రిపోర్ట్‌లో పేరొన్న లోపాలను సవరించాల్సి ఉన్నదని స్పష్టంచేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ తరఫు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, గోపాల్ శంకర్ నారాయణన్ జోక్యం చేసుకొని, కేసులో మొత్తం 15 మంది ప్రతివాదులున్నా ప్రస్తుతానికి కేవలం ఏపీకి వ్యతిరేకంగా మాత్రమే మధ్యంతర ఉత్తర్వులు (ఇంజంక్షన్) కోరుతున్నామని, అందువల్ల మిగతా ప్రతివాదులకు నోటీసులు అందలేదనే కారణంతో విచారణను నిలిపివేయాల్సిన అవసరం లేదని, నిబంధనలు అందుకు అడ్డుకావని వాదనలు వినిపించారు.
అయినా సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు. తెలంగాణ వాదనలతో ఏకీభవించలేదు. ఆఫీస్ రిపోర్టును పకనపెట్టి పిటిషన్‌ను విచారించలేమని స్పష్టంచేసింది. పిటిషన్‌ను తిరస్కరించింది. నిబంధనల ప్రకారం అభ్యంతరాలను పరిషరించాలని, ఆ తర్వాతే కేసును మళ్లీ విచారణ జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని సైతం సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో తెలంగాణ సర్కార్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు.
ఇదిలా ఉంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే లోపభూయిష్టమైన పిటిషన్ దాఖలు చేసిందని స్పష్టంగా తెలిసిపోతున్నది. అంతేకాదు పసలేని వాదనలు వినిపిస్తున్నదని తేటతెల్లమైపోతున్నది. ఏపీ చేపట్టిన పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు ఆదినుంచీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సహకరిస్తూనే వస్తున్నది. అందరికంటే ముందుగా చర్చల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే ఉత్సాహం చూపారు. ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించి మరీ చర్చలు జరిపారు. ప్రాజెక్టుకు కేంద్రం మధ్యవర్తిత్వం వహిస్తుండగా, వ్యక్తిగత, రాజకీయ స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతూ రేవంత్ సర్కార్ సైతం ఆ ప్రణాళికలకు దాసోహమన్నది.
రేవంత్ వ్యవహారాన్ని తెలంగాణ నీటిరంగ నిపుణులు, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉన్నారు. నిజాలను, రేవంత్ సర్కార్ ద్రోహాన్ని బయటపెడుతూనే ఉన్నారు. దీంతో కాంగ్రెస్ సర్కార్ ప్రాజెక్టుపై మొక్కుబడిగా వ్యతిరేకత వెల్లడిస్తున్నది. తాజాగా లోపాలతో కూడిన పిటిషన్ వేయడంతో మరోసారి అదే విషయం స్పష్టమైంది. ఇటీవల కర్ణాటకలో జరిగిన ముగ్గురు సీఎంల సమావేశంలోనూ కేంద్రం, ఏపీ చేసిన ప్రతిపాదనలకు అంగీకరించినట్టు తెలుస్తున్నది.
అదీగాక గతంలో ఏపీ అక్రమంగా చేపట్టిన అనేక ప్రాజెక్టులపై కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం సుప్రీంకోర్టులో పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేసింది. సెక్షన్ 3 మొదలు, రాయలసీమ లిఫ్ట్ తదితర ప్రాజెక్టులను సవాల్ చేసింది. నాడు ఏ పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించిన దాఖలాలేదు. కానీ ప్రస్తుతం రేవంత్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అంటే ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం లోపభూయిష్టంగా పిటిషన్లు దాఖలు చేస్తూ నమ్మబలుకుతున్నదని స్పష్టమవుతున్నది.
పోలవరం-బనకచర్ల (నల్లమలసాగర్) ప్రాజెక్టుకు ఏపీ సర్కార్ డీపీఆర్ తయారు చేసేంతవరకూ రేవంత్ సర్కార్ మౌనంగానే ఉన్నది. డీపీఆర్ టెండర్ల ముగిసి, అవార్డు అయిన తర్వాత, అప్పటికీ తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత వెల్లువెత్తడంతో హడావుడిగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అదీ రిట్ పిటిషన్ వేసింది. కేసు నిలువబోదని, పోలవరం ప్రాజెక్టు అనధికారిక విస్తరణలపై పిటిషన్ వేయాలని, సవాల్ చేయాలని న్యాయనిపుణులు, ఇంజినీర్లు సూచించినా పెడచెవిన పెట్టింది. పిటిషన్ వేసిన రేవంత్‌రెడ్డి సర్కార్ మరోవైపు బనకచర్లపై చర్చలకు సిద్ధమైంది. కమిటీ ఏర్పాటుకు అంగీకరించింది. ఇదే విషయాన్ని నాడు సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.
‘జలవివాదాల పరిష్కారానికి కమిటీ వేసుకున్నారు. మూడు నెలల్లో ఆ కమిటీ నివేదిక ఇస్తుందని మీరే చెప్తున్నారు. మరి అప్పటివరకు ఆగాలి కదా? కోర్టుకు ఎందుకు వచ్చారు?’ అంటూ రేవంత్ సర్కార్‌ను సర్వోన్నత న్యాయస్థానం దులిపేసింది. ఏపీ చేపట్టిన పోలవరం-నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుపై స్టే ఇచ్చేది లేదని కరాఖండిగా తేల్చిచెప్పింది.
ఏకంగా తెలంగాణ రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్ విచారణర్హతను అత్యున్నత ధర్మాసనం ప్రశ్నించింది. సివిల్ వివాదమని తేల్చిచెప్పింది. దీంతో నాడు రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం సివిల్ సూట్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది. గత అనుభవాల దృష్ట్యా అన్నివిధాలుగా అధ్యయనం చేసి పిటిషన్ దాఖలు చేయకుండా మొక్కుబడిగా రిట్ పిటిషన్ దాఖలు చేసింది. వెరసి తాజాగా ఆ పిటిషన్‌ను విచారించలేమని, అనేక లోపాలున్నాయని సుప్రీంకోర్టు తేల్చిచెప్పడం రేవంత్ సర్కార్ తీరుకు అద్దంపడుతున్నది. బనకచర్ల కోసం ఏపీకి ఎంతగా సహకరిస్తున్నదో తేలిపోతున్నది.