హైదరాబాద్, జులై 31(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మరో మూడు నెలల్లో 10 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో గురువారం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉప ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతున్నది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా స్పీకర్ కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్’ అన్నట్టుగా ఉందని వ్యాఖ్యానించింది. అయితే ఈ కేసులో పేషెంట్‌ను డెడ్ కానివ్వబోమని స్పష్టం చేసింది. అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కచ్చితంగా చర్యలుంటాయనే సంకేతాలను సుప్రీంకోర్టు ఇచ్చింది. అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రతిపక్ష బీఆర్ఎస్ పక్కా ఆధారాలను సుప్రీంకోర్టుకు అందించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు అంత నిక్చచ్చిగా తీర్పు ఇచ్చిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ సైతం కచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని న్యాయ నిపుణు లు అభిప్రాయపడుతున్నారు. దీన్ని మరింత కాలం సాగదీసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలేవీ కనిపించడం లేదని అంటున్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయక తప్పదని అభిప్రాయపడుతున్నారు. జూబ్లీహి ల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి నేపథ్యంలో అక్కడ త్వరలోనే ఉప ఎన్ని క జరగనుంది. తాజాగా సుప్రీం తీర్పు నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటే ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లోనూ ఉప ఎన్నిక జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
సుప్రీంకోర్టు తీర్పుతో 10 మంది జంప్ జిలానీ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు మొదలైంది. పదవుల కోసం ఆశపడి పార్టీ మారితే ఉన్న పదవికే ఎసరొచ్చిందంటూ సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు తెలిసింది. ఉప ఎన్నికలు అనివార్యమైన పరిస్థితుల్లో తమ రాజకీయ భవిష్యత్తు అంధకారమవుతుందంటూ ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. తమ బతుకులు రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తునట్టు సమాచారం. పార్టీ మారడం వల్ల ప్రజల్లో ఇప్పటికే పలుచనయ్యామని అంటున్నట్టు తెలిసింది. ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ను ఎదుర్కొనలేమని, ఆ పార్టీ అభ్యర్థుల చేతిలో తమ ఓటమి ఖాయమని సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. కనీసం ప్రభుత్వం పేరుపై ప్రజల్లోకి వెళ్దామనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పేరు, గుర్తు చూస్తేనే రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందని ఓ ఫిరాయింపు ఎమ్మెల్యే అన్నట్టు తెలిసింది.
మాయ మాటలు విని, ఏదో ఊహించుకొని కాంగ్రెస్‌లో చేరామని, కానీ చేరిన తర్వాత గానీ తాము చేసిన తప్పు తెలిసిరాలేదని వాపోతున్నట్టు సమాచారం. తాము చేసిన తప్పునకు శిక్ష పడాల్సిందేనని, ఇలాగైనా భవిష్యత్తులో గుఠపాఠం వస్తుందని అన్నట్టు సమాచారం. భవిష్యత్తులో తాము మళ్లీ ఎమ్మెల్యే కావడం కష్టమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున పోటీ చేసి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, కృష్ణ మోహన్‌రెడ్డి ఆ తర్వాత పార్టీ ఫిరాయించారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. దానం నాగేందర్ అయితే కాంగ్రెస్ తరుఫున సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయడం గమనార్హం. రాజ్యాంగానికి విరుద్ధంగా పార్టీ మారిన ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది.